కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అత్యంత నాటకీయంగా సాగుతోంది. నాయకత్వం మార్పునకు సంబంధించి సోనియా గాంధీకి పార్టీ సీనియర్లు లేఖ రాసిన వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆ లేఖపై అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారని వార్తలు రాగా... సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. అవన్నీ అవాస్తమవి తాజాగా ప్రకటించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సిబల్ ట్వీట్ ఉపసంహరణ
"కొందరు భాజపాతో కుమ్మక్కు అయ్యారు" అని రాహుల్ అనడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తూ తొలుత ట్వీట్ చేశారు సిబల్. గడిచిన 30 ఏళ్లలో ఏరోజూ భాజపాకు అనుకూలంగా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు కాంగ్రెస్ పక్షానే నిలిచామని, మణిపుర్‌లోనూ భాజపాను గద్దె దించేందుకు పార్టీ పక్షాన పోరాడామని గుర్తుచేశారు. అయినా తాము భాజపాతో కుమ్మక్కయ్యామని రాహుల్ అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొద్దిసేపటికే రాహుల్ తనతో వ్యక్తిగతంగా మాట్లాడారని, అసలు తను అలా అనలేదని స్పష్టం చేశారని చెప్పారు. అందుకే ఇంతకుముందు తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు సిబల్.
రాజీనామాకు సిద్ధం: ఆజాద్
"కుమ్మక్కు వ్యాఖ్యల"పై తీవ్రంగా స్పందించారు సీనియర్ నేత గులాం నబీ అజాద్. భాజపాతో జట్టు కట్టి సోనియాకు లేఖ రాశామని నిరూపిస్తే తాను పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి చేసిన తాజా ప్రకటనపై ఆజాద్ స్పందించాల్సి ఉంది.
ఇదీ చూడండి: సీనియర్ల లేఖపై రాహుల్ గాంధీ ఆగ్రహం