కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ లోక్సభ నియోజకవర్గంలో వరదల కారణంగా భారీ నష్టం జరిగింది. ఆదివారం కేరళ చేరుకున్న రాహుల్... వయనాడ్, మలప్పురం జిల్లాల్లో పర్యటించారు. కొట్టకల్, నిలంబుర్ ప్రాంతాల్లోని పునరావాస శిబిరాల్లో ఉన్న వరద బాధితులను పరామర్శించారు.
సర్వస్వం కోల్పోయిన బాధితులను చూస్తుంటే తన హృదయం తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్. తక్షణమే అవసరమైన సహాయక చర్యలు అందించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరినట్లు చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలంతా కేరళకు సాయం అందించాలని పిలుపునిచ్చారు రాహుల్. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారికి వైద్య సదుపాయం కల్పించాలని కోరుతున్నట్లు తెలిపారు
72కు పెరిగిన మృతులు
వరుణ ప్రతాపంతో కకావికలమైన కేరళలో గత నాలుగు రోజుల్లో వర్షాలు, వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 72కు చేరింది. మరో 58 మంది ఆచూకీ గల్లంతయ్యింది. 2.51 లక్షల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. మల్లప్పురం జిల్లా కవలప్పరలో కొండచరియలు విరిగిపడి 35 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వాటిలో నుంచి ఇప్పటివరకూ 11 మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనలో 65 మంది వరకూ సజీవ సమాధై ఉంటారని స్థానికులు అంచనా వేస్తున్నారు.
గత ఏడాది ఆగస్టులో వరదల కారణంగా కేరళలో 400 మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వరుసగా రెండో ఏడాది కేరళను వరదలు ముంచెత్తాయి.