కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. పెరుగుతోన్న నిరుద్యోగం, ఆర్థిక సమస్యలపై దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన తొలి ర్యాలీ జనవరి 28న రాజస్థాన్ జయపుర్లో జరగనుంది.
దేశ ఆర్థిక దుస్థితి కారణంగా ఉద్యోగాలు లేక యువత ఎదుర్కొంటున్న సమస్యలు, పెరుగుతోన్న నిరుద్యోగం వంటి విషయాలపై రాహుల్ గాంధీ దృష్టి పెట్టనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే రాహుల్ తొలి ర్యాలీ జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతరం మధ్యప్రదేశ్‌లో రైతులు, గిరిజనులు, గ్రామీణ ఉద్యోగులను ఉద్దేశించి రాహుల్ ఓ ర్యాలీ నిర్వహించనున్నారు.
తర్వాత ముంబయిలోని చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ముందు రాహుల్ మాట్లాడనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌పై కసరత్తు జరుగుతున్నట్లు రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ తెలిపారు.
తొలిసారి...
పార్లమెంటు ఆమోదించిన చట్టంపై తొలిసారి దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయని సచిన్ పైలట్ ఆరోపించారు. పలు రాష్ట్రాల అసెంబ్లీలు సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేస్తున్నట్లు ప్రస్తావించారు. దేశ ఆర్థిక దుస్థితి కారణంగా ముఖ్యంగా నిరుద్యోగులు నష్టపోతున్నారన్నారు పైలట్.