నాయకత్వ సమస్యలు ఎదుర్కొంటున్న పార్టీని ముందుకు నడిపించేందుకు ఎన్నికలు నిర్వహించాలని పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్న తరుణంలో.. అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ మాత్రమే సరైన అభ్యర్థి అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
పార్టీ నాయకులంతా రాహుల్‌నే అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారని.. అందుకు ఎన్నికలు కూడా అవసరం లేదని వారు భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌లో నాయకత్వ సమస్యపై ప్రస్తుతం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఒకరు రాహుల్‌కు అధ్యక్ష భాధ్యతలు ఇవ్వడం ఆమోదయోగ్యమేనని.. ఆయనకు పార్టీని నడిపే సామర్థ్యం ఉందని ఉద్ఘాటించారు.
ఏప్రిల్‌లో పార్టీ ప్లీనరీ నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అప్పుడే రాహుల్‌ను అధ్యక్ష పదవికి ఎంపిక చేసే అవకాశాలున్నాయని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.
నాయకత్వమే సమస్య..
కాంగ్రెస్‌కు నాయకత్వమే ప్రశ్నార్థకంగా మారిందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ ఇటీవలే అన్నారు. ఈ వ్యాఖ్యలను సమర్థించిన మరో సీనియర్ నేత శశిథరూర్.. పార్టీలో ఉత్సాహాన్ని, ఓటర్లలో ప్రేరణను తీసుకువచ్చేందుకు పార్టీ సంస్థాగత ఎన్నికల్ని నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని కోరారు.