ఆర్బీఐ అనుమతులు లేక రాష్ట్రాల్లో రుణమాఫీ సాధ్యం కావటం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఫలితంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేరళలోని వాయనాడ్‌లో రైతుల పరిస్థితిని ఉదహరించి కేంద్రంపై విమర్శలు గుప్పించారు రాహుల్.
"దేశంలో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది. కేరళలో రైతుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నా. ఒక్క వాయనాడ్‌లోనే 8వేల మంది రైతులు రుణాలు చెల్లించాల్సి ఉంది. అప్పు చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నాయి. ఆస్తులు జప్తు చేస్తున్నాయి. ఇదే అక్కడ ఆత్మహత్యలకు కారణమవుతోంది. కేరళ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని అంగీకరించాలని ఆర్బీఐకి కేంద్రం సూచించాలని నా విజ్ఞప్తి.
ఈ 5 ఏళ్లలో వ్యాపార వేత్తలకు 4.3 లక్షల కోట్లు పన్ను రాయితీలు, 5.5 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసింది. ఎందుకు ఈ రెండు నాలుకల ధోరణి. రైతుల వృద్ధికి సంబంధించి ఈ బడ్జెట్లో ఎలాంటి దృఢమైన నిర్ణయం తీసుకోకపోవటం బాధాకరం."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
మీరే కారణం: రాజ్‌నాథ్
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. భాజపా ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు తగ్గాయని తెలిపారు. రైతుల కోసం చాలా చేశామనీ, అయితే చేయాల్సింది ఇంకా ఎంతో ఉందన్నారు.
"రైతుల పరిస్థితి ఈ నాలుగు ఐదేళ్లలోనే ఏర్పడింది కాదు. వాళ్లు కొన్నేళ్లపాటు చేసిన పాలనతోనే రైతులకు ఈ దుస్థితి ఏర్పడింది. ఇందుకు వాళ్లే బాధ్యులు. మోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతుల ఆదాయం రెండింతలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోన్న మొదటి ప్రధాని మోదీనే."
-రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి