భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన అవినీతి ఆరోపణలను ఖండించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు భాజపా సీనియర్ నేత. ప్రధాని స్థానంలో నరేంద్రమోదీ ఎప్పుడూ హూందాగా వ్యవహరించారని పీటీఐ వార్తాసంస్థ ముఖాముఖిలో ఉద్ఘాటించారు గడ్కరీ.
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తుందా?
కచ్చితంగా భాజపాదే విజయం. మంచి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మళ్లీ మోదీయే ప్రధాని. ఆ స్థానంలో ఆయన హూందాగా వ్యవహరించారు. ఒక ప్రధానమంత్రి గురించి ఇష్టారీతిన వ్యాఖ్యానించటం రాహుల్‌గాంధీకే చెల్లింది.
ప్రస్తుత ఎన్నికల్లో కీలకాంశాలు ఏమిటి?
ఎన్నికల్లో ఆర్థిక స్థితిగతులు, జాతీయ భద్రత లాంటి అంశాలు ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి విషయాలపై ప్రజలు చర్చించాల్సిన సమయమిదే. ప్రగతి, అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం. ఇవే 21వ శతాబ్దపు రాజకీయ నినాదాలు.
ఇవీ చూడండి:
న్యాయ్‌ను ఎలా ఎదుర్కోబోతున్నారు?
25 కోట్ల మందికి ఏటా 72వేల రూపాయల కనీస ఆదాయం పథకం... ప్రజాకర్షక నినాదం మాత్రమే. రాజకీయ వ్యూహంతో పేదల ఓట్లు రాబట్టుకోవటానికే కాంగ్రెస్ ప్రయత్నం. పథకాన్ని అమలు చేయాలంటే రూ. 3.5 లక్షల కోట్లు కావాలి. దానికి నిధులను ఎక్కడి నుంచి తీసుకొస్తారు. సరే.. డబ్బంతా దీనికే ఉపయోగిస్తే మిగిలిన రంగాలకు ఏమిస్తారు? రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రజాకర్షక నినాదాలు ఆర్థిక లోటుకు కారణమవుతాయి. 1947 నుంచి కాంగ్రెస్‌ది 'గరిబీ హఠావో' నినాదమే.
సీనియర్ నేతలను పక్కన పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. మీరేమంటారు?
ప్రతి పార్టీలోనూ కొంత కాలం తర్వాత ఎవరైనా వైదొలగాల్సిన సమయం వస్తుంది. ప్రతి రంగంలోనూ కాల పరిమితి ఉంటుంది. అడ్వాణీ, జోషీ లాంటి అగ్రనేతల పట్ల మాకు గౌరవముంది. ఇప్పటికీ వారు మాకు మార్గదర్శకులు, స్ఫూర్తి దాతలే.
అడ్వాణీ తన బ్లాగులో రాసిన విషయాలు ఎవరిని ఉద్దేశించినవి?
బ్లాగులో అడ్వాణీ వ్యాఖ్యలకు మేమూ మద్దతిస్తాం. అయితే కొంత మంది అడ్వాణీ వ్యాఖ్యలు మాకు ఆపాదించాలని చూశారు. అది పూర్తిగా తప్పు. అడ్వాణీ అభిప్రాయంతో మేం ఏకీభవిస్తున్నాము.
వ్యవసాయం, ఉద్యోగాలపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ప్రస్తుతం వ్యవసాయ సంక్షోభం ప్రధాన సమస్య. పరిష్కారం కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. నీటిపారుదల సౌకర్యాలు, వ్యవసాయాధారిత పరిశ్రమలు, వైవిధ్య వ్యవసాయ పద్ధతుల ద్వారా ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. కొన్ని పరిశ్రమలు ఇప్పటికే మంచి స్థానంలో ఉన్నాయి. స్థిరాస్తి రంగంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉక్కు రంగంలో పలు సమస్యలను ఇప్పటికే పరిష్కరించాం. బలమైన విధానాలతోనే ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. దానికి కొంత సమయం పడుతుంది.
ఇవీ చూడండి: