కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తనపై నమోదైన పరువు నష్టం కేసులతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నెల 4న ముంబయి కోర్టు ముందు హాజరైన ఆయన.. నేడు మరో కేసు విషయమై పట్నా కోర్టులో విచారణ ఎదుర్కోనున్నారు.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆయా రాష్ట్రాల్లో పరువు నష్టం కేసులు దాఖలు చేశారు.
ఏప్రిల్ 13న కర్ణాటక కోలార్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు.. భాజపా-ఆరెస్సెస్‌పై విమర్శలు గుప్పించారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ పేర్లను ప్రస్తావిస్తూ.. ఇలా అందరు దొంగల పేర్ల వెనుక 'మోదీ' అని కామన్‌గా ఎందుకుంటుందని రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సుశీల్ మోదీ ఫిర్యాదు...
రాహుల్ మాటలపై ఆగ్రహించిన బిహార్ ఉపముఖ్యమంత్రి, భాజపా నేత సుశీల్ కుమార్ మోదీ ఏప్రిల్ 18న అక్కడి పట్నా కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సుశీల్ ఫిర్యాదును పరిశీలించిన న్యాయస్థానం.. విచారణకు హాజరుకావాలని రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ నేత శతృఘ్న సిన్హా.. రోడ్ షో సందర్భంగా రాహుల్ చివరగా మే నెలలో పట్నా వెళ్లారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్ కోర్టుల్లో నమోదైన పరువునష్టం కేసు విచారణలకూ రాహుల్ రాబోయే రోజుల్లో హాజరుకావాల్సి ఉంది. సంఘ్ కార్యకర్త, న్యాయవాది జోషి పరువునష్టం కేసు విచారణలో ముంబయి కోర్టు జులై 4న రూ. 15 వేల పూచీకత్తుతో రాహుల్‌కు బెయిల్ మంజూరు చేసింది.