లోక్సభ ఎన్నికల ప్రణాళికపై ముమ్మర కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ నిరుపేదలకు వరాల జల్లు కురిపించింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని 20 శాతం నిరుపేద కుటుంబాలకు ఏటా 72 వేలు నగదు బదిలీ చేయనున్నట్లు ప్రకటించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈ పథకం ద్వారా 5 కోట్ల కుటుంబాలకు అంటే దాదాపు 25 కోట్ల మందికి నేరుగా లబ్ది చేకూరనుందన్నారు.
కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ సీడబ్ల్యూసీలో ఎన్నికల ప్రణాళికపై చర్చించిన అనంతరం ఈ ప్రకటన చేశారు రాహుల్.
పేదరికంపై అంతిమ పోరుకు మొదలైందని,దేశంలో పేదరికాన్ని నిర్మూలించి తీరుతామని రాహుల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఈ పథకం అమలుకు సంబంధించి అవసరమైన నిధులపై నిపుణులతో చర్చించి పూర్తి అవగాహనకు వచ్చాకే ప్రకటన చేస్తున్నామని పేర్కొన్నారు.
"గత ఐదేళ్లలో ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవించారు, వారికి విముక్తి కల్పిస్తాం"
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు.