కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష హోదా నుంచి పూర్తిస్థాయిలో తప్పుకున్నారు రాహుల్ గాంధీ. ఎన్నికల్లో పరాభవానికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజీనామా లేఖ పంపారు. సామాజిక మాధ్యమాలలోనూ అధ్యక్ష హోదా తొలగించారు రాహుల్.
రాహుల్ వైదొలిగిన నేపథ్యంలో తాత్కాలిక పార్టీ అధ్యక్షుడిగా ముగ్గురి పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరిలో సీనియర్ నేతలు అశోక్ గహ్లోత్, సుశీల్ కుమార్ షిండే, మోతీలాల్ వోరా ఉన్నారు. మోతీలాల్ వోరావైపే కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
రాహుల్ రాజీనామాతో 2, 3 రోజుల్లో పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ భేటీ జరుగుతుందని సమాచారం. ఈ సమావేశంలోనే పార్టీ అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
అద్భుతమైన అవకాశం
ఇకపై తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కాదంటూ రాహుల్ ప్రకటించారు. సీడబ్ల్యూసీ త్వరలోనే సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని పార్టీకి సూచించారు.
"కాంగ్రెస్ పార్టీకి సేవ చేయటం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. మన దేశ విలువలు, భావజాలాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ పాటించింది. నా దేశానికి, పార్టీకి ఎప్పటికీ ప్రేమతో గౌరవంతో రుణపడి ఉంటా."
-రాహుల్ గాంధీ
ఇదీ చూడండి: కాంగ్రెస్కు నేను అధ్యక్షుడ్ని కాదు: రాహుల్