రఫేల్ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ అక్రమాలకు పాల్పడ్డారని మరోమారు ఆరోపించారు రాహుల్ గాంధీ. రఫేల్‌కు సంబంధించిన కీలక పత్రాల మాయం అయ్యాయన్న ప్రకటన నేపథ్యంలో అధికార పక్షంపై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు.
ప్రధాని సహా రఫేల్ ఒప్పందంతో సంబంధమున్న ప్రతి ఒక్కరిపై విచారణ జరగాలని రాహల్ దిల్లీలో డిమాండ్ చేశారు. రఫేల్ ఒప్పందంలో నరేంద్ర మోదీ ఏకపక్షంగా వ్యవహరించారన్న విషయం అపహరణకు గరైన పత్రాల్లో స్పష్టంగా పొందుపరిచి ఉందని తెలిపారు. నరేంద్ర మోదీని కాపాడేందుకు ఏ ప్రభుత్వ సంస్థనైనా నాశనం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం వెనకాడబోదని తీవ్ర ఆరోపణలు చేశారు రాహుల్.
"నిన్న అసక్తికర చర్చ జరిగింది. మీడియాను విచారించాలన్నారు. ఎందుకంటే రఫేల్ పత్రాలు చోరీకి గురయ్యాయి. రూ. 30వేల కోట్ల ఒప్పందం ఎలా జరిగిందో అపహరణకు గురైన పత్రాల్లో స్పష్టంగా ఉంది. ఫ్రాన్స్ ప్రభుత్వంతో సమాంతర చర్చలు జరిగాయని అందులో ఉంది. కానీ వాటిపై దర్యాప్తు చేపట్టరు. ఎలాగైనా నరేంద్ర మోదీని కాపాడాలన్నదే వారి ఉద్దేశం. మోదీనే మొదట ఒప్పంద చర్చలు ప్రారంభించారని పత్రాల్లో ఉంది. ఖరీదును పెంచారని స్పష్టంగా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ఏకపక్షంగా వ్యవహరించారని అధికారుల బృందమే తెలిపింది. అనిల్ అంబానీకి కాంట్రాక్టు కట్టబెట్టాలని ప్రధాని మోదీ చెప్పారని అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు నాతో అన్నారు. పత్రాలపై మీరు దర్యాప్తు చేపట్టండి. వాటిలో మోదీ పేరు కచ్చితంగా ఉంటుంది."
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు