ప్రధాని నరేంద్రమోదీపై విమర్శల జోరు పెంచారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్ కటిహార్, బంగాల్ రాయ్గంజ్లో పర్యటించారు రాహుల్. అవినీతి, రఫేల్‌పై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని మోదీకి సవాల్ విసిరారు రాహుల్.
"
అవినీతిపై నరేంద్రమోదీని మీ ముందు నాతో చర్చించమనండి. రఫేల్‌పై మాట్లాడేందుకు 15 నిమిషాలు కేటాయించమనండి. మీకు ముఖం చూపించడానికి కూడా ఆయన ఇబ్బంది పడేలా చేస్తా. మీరు అనిల్ అంబానీకి 30వేల కోట్లు ఎందుకు ఇచ్చారు? మీరు ఫ్రాన్స్‌కు అనిల్ అంబానీతో కలిసి వెళ్లారా లేదా? ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా చెప్పారు... రఫేల్ ఒప్పందం హెచ్ఏఎల్కు కాకుండా అనిల్ అంబానీకే ఇవ్వాలన్నది మోదీ నిర్ణయమేనని. "
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
ధనికులకే మోదీ రుణమాఫీ
దేశాన్ని పేద, ధనిక వర్గాలుగా మోదీ విడగొట్టారని రాహుల్ ఆరోపించారు. దేశంలోని అత్యంత ధనికులకే మోదీ రుణమాఫీ చేశారని విమర్శించారు కాంగ్రెస్ అధ్యక్షుడు.
"నరేంద్ర మోదీ తన మిత్రులు నీరవ్ మోదీ, అనిల్ అంబానీలను ఒకవైపు, పేదరైతులను మరోవైపుగా విభజించారు. దేశంలోని అత్యంత ధనికుల చేతికి బ్యాంకుల తాళాలిచ్చారు. అధికారంలోకి వచ్చాక మళ్లీ వాటిని ప్రజల చేతికిస్తాం. రఫేల్‌కు భయపడే మోదీ వాగ్ధాటి తగ్గింది."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
ఇదీ చూడండి: 'పారికర్ లేని లోటు కనిపిస్తోంది'