రఫేల్ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ పిటిషనర్లు దాఖలు చేసిన పత్రాలు జాతీయ భద్రతకు ముప్పుగా మారుతాయని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. కుట్ర పూరితంగా పత్రాల నకలుకు పాల్పడిన వారు నేరానికి పాల్పడినట్టేనని పేర్కొంది. పత్రాలను బహిర్గతం చేసి జాతీయ భద్రతను ప్రమాదంలో పెట్టారని తెలిపింది.
రఫేల్ పత్రాల లీకేజ్‌పై ఫిబ్రవరి 28 నుంచివిచారణ చేపట్టినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ మిత్రా తెలిపారు. లీకేజీ ఎక్కడి నుంచి జరిగిందో తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోందని తెలిపారు. పత్రాలు సమర్పించిన పిటిషనర్లు మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు... శత్రువులు, విరోధుల చేతుల్లో యుద్ధవిమానాల పత్రాలను పెట్టారని ఆరోపించారు.
రఫేల్ పత్రాలు మాయమైన విషయానికి ప్రాధాన్యతనిచ్చింది అఫిడవిట్. పత్రాలు చోరీకి గురయ్యాయని మార్చి 6న సుప్రీంకు తెలిపారు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్. రెండు రోజుల తర్వాత అవి భద్రంగానే ఉన్నాయని చెప్పారు. పిటిషనర్లు ఒరిజినల్ పత్రాల నకలును దరఖాస్తులో చేర్చారని అఫిడవిట్ తెలిపింది.
జాతీయ భద్రతపై అంశాలను, కొన్ని విషయాలను గోప్యంగా ఉంచుతామని ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకున్నామని అఫిడవిట్లో పేర్కొంది రక్షణ శాఖ. కేంద్రం గోప్యతను పాటిస్తున్నప్పటికీ సిన్హా, శౌరీ, భూషణ్ పత్రాలను స్వాధీనం చేసుకుని ఒప్పందాన్ని అవమానించారని పేర్కొంది. వారు అనధికారికంగా పత్రాలను పొందారని ఆరోపించింది.