కోజికోడ్ విమానాశ్రయ రన్‌వే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) ప్రమాణాలకు అనుగుణంగా ఉందని కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరీ స్పష్టం చేశారు. కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు ట్విట్టర్ వేదికగా అడిగిన ప్రశ్నలకు వరుస ట్వీట్లతో ఈ మేరకు స్పందించారు పౌర విమానయాన శాఖ మంత్రి. అవగాహన లేకుండా విమర్శించారని కాంగ్రెస్ ఎంపీలకు చురకలంటించారు.
"కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు నిజాలేంటో తెలుసుకోకుండా ట్వీట్లు చేశారు. ఎంపీ రవనీత్ సింగ్నా నారో బాడీ, వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌కు తేడా తెలియకుండానే ఈ విషయంలో నిపుణుడిలా మాట్లాడారు. నా స్నేహితుడు శశిథరూర్ మాత్రం నిజాలు తెలుసుకుని తను మాట మార్చటం సంతోషంగా ఉంది. నేను కోజికోడ్‌కు మార్గమధ్యలో ఉన్నప్పుడు.. అక్కడకు వెళ్లాల్సిందని మాణిక్కమ్ ఠాగూర్ సలహా ఇచ్చారు."
- హర్దీప్ సింగ్ పూరీ, పౌర విమానయాన శాఖ మంత్రి
నిషేధం ఎత్తివేత!
అంతకుముందు లూధియానా ఎంపీ రవనీత్ సింగ్ బిట్టు కేంద్రంపై ఆరోపణలు చేశారు.
"కోజికోడ్ విమానాశ్రయంలో వైడ్ బాడీ విమానాల ల్యాండింగ్‌పై 2015పై నిషేధం విధించారు. 2019 జులైలో పూరీ ఈ నిషేధాన్ని ఎత్తివేశారు. దాని ఫలితమే ఈ ప్రమాదం."
-రవనీత్ సింగ్ పూరీ, కాంగ్రెస్ ఎంపీ
కోజికోడ్ ప్రమాదం..
కేరళలోని కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు 18 మంది మరణించారు. శుక్రవారం ఐఎక్స్ 1355 ఎయిర్ ఇండియా విమానం ఇక్కడి టేబుల్ టాప్ రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపు తప్పటంతో ఈ దుర్ఘటన సంభవించింది. వందేభారత్ మిషన్‌లో భాగంగా దుబాయి నుంచి భారత్‌కు వచ్చిన ప్రవాస భారతీయులు.. మరికొద్ది సేపట్లో తమ స్వస్థలాలకు చేరుతారనగా జరిగిన ఈ దుర్ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఇదీ చూడండి: కేరళ విమాన ప్రమాదం: తొలి 5 నిమిషాల్లో జరిగిందిదే