కరోనా మహమ్మారితో ఏర్పడిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునేందుకు ఓ కొత్త రకం పన్నును వెలుగులోకి తెచ్చింది పంజాబ్ ప్రభుత్వం. అదే కొవిడ్-19 సెస్. మద్యం అమ్మాకాలపై సోమవారం నుంచి ఈ పన్నును అమలులోకి తెచ్చింది.
మద్యం రకాన్ని బట్టి రూ.2 నుంచి రూ.50 వరకు అదనంగా ఎక్సైజ్ డ్యూటీ, సెస్‌ను విధించింది ప్రభుత్వం. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఈ ఆర్థిక ఏడాదిలో అదనంగా రూ. 145 కోట్ల ఆదాయం సమకూరనుంది.
" కరోనా వైరస్, లాక్‌డౌన్‌తో భారీగా ఆదాయ నష్టంతో జూన్ 1 నుంచి మద్యం అమ్మకాలపై కొవిడ్ సెస్ విధించేందుకు నిర్ణయించాం. కరోనాతో రాష్ట్రం రూ.26వేల కోట్ల ఆదాయం కోల్పోయింది. అది 2020-21 ఆర్థిక ఏడాది బడ్జెట్ రెవెన్యూ అంచనాల్లో 30 శాతం. తప్పనిసరై అదనపు రెవెన్యూ కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం. మే 12న ఏర్పాటు చేసిన మంత్రుల బృందం అదనపు ఎక్సైజ్ సుంకం, సెస్ విధించాలని సూచించింది. అదనపు సుంకం ద్వారా వచ్చే ఆదాయాన్ని కొవిడ్-19 సంబంధిత ఖర్చులకే వినియోగిస్తాం."
- అమరిందర్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి
ఎల్-1 లేదా ఎల్-13 (హోల్‌సేల్ లైసెన్స్) కేంద్రాల నుంచి మద్యం రవాణా చేసేందుకు అనుమతులు ఇచ్చే సమయంలోనే సెస్ విధించాలని ఎక్సైజ్, పన్నుల విభాగానికి సూచించారు సింగ్. మంత్రుల బృందం సిఫార్సుల మేరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మద్యంపైనా ఈ సెస్ విధించనున్నారు అధికారులు.