గల్వాన్ లోయలో సైనికుల ఘర్షణ కారణంగా చైనాపై భారత్ ప్రజల్లో కోపాగ్ని రాజుకుంది. ఈ నేపథ్యంలో చైనా వస్తువులు బహిష్కరించాలనే డిమాండ్ వినిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో చైనా వస్తువులను ధ్వంసం చేశారు. చైనా యాప్లను నిషేధించాలని నిరసనలు హోరెత్తుతున్నాయి. అయితే మహారాష్ట్ర పుణె జిల్లాలోని కోంఢ్వే-ధావడే గ్రామస్థులు చైనా వస్తువుల అమ్మకం, కొనుగోలు నిషేధించాలని గ్రామ పంచాయితీ సమావేశంలో తీర్మానించుకున్నారు. ఈ నిర్ణయం జులై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు గ్రామాధికారులు తెలిపారు.
అమ్మకూడదు.. కొనకూడదు..!
చైనా వస్తువులను నిషేధిస్తూ గ్రామ పంచాయతీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చైనా ఉత్పత్తులను అమ్మకూడదని ఆ గ్రామంలోని దుకాణదారులను ఆదేశించారు గ్రామాధికారులు. గ్రామస్థులు కూడా చైనా వస్తువులు కొనుగోలు చేయకూడదు.
"ఈ నిర్ణయాన్ని పంచాయతీ సమావేశంలో తీసుకున్నాం. గ్రామ పంచాయతీ కాంట్రాక్టర్లకు ఇదే విషయాన్ని తెలియజేశాం. ఒప్పందంలోనూ ఈ అంశాలను ప్రస్తావించాం. చైనా ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరపకూడదని గ్రామ ప్రజలకు, దుకాణదారులకు సమాచారం అందించాం. బ్యానర్లు, పోస్టర్లు అతికించి ప్రచారం చేస్తున్నాం."
- నితిన్ ధ్వాడే, కోంఢ్వే-ధావడే గ్రామ సర్పంచ్
ఇదీ చూడండి: భవిష్యత్ తరాల మార్గదర్శి- సంస్కరణల రుషి 'పీవీ'