కరోనా హాట్‌స్పాట్‌గా మారిన పుణేకు చెందిన చాలా మందిలో ఇప్పటికే వైరస్‌కు సంబంధించిన యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు ఓ సెరోలాజికల్ సర్వేలో తేలింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఈ సర్వే చేసింది.
51.05 శాతం మందికి కరోనా..
పుణేలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న 5 వేర్వేరు ప్రాంతాల్లో 1,664 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు పరిశోధకులు. ఇందులో ఎరవాడ, కస్బాపత్-విశ్రమ్బాగ్, రస్తాపేత్-రవివార్పేత్, లొహియా నగర్-కాశీవాడి, నవీపేత్-పార్వతీ ప్రాంతాలు ఉన్నాయి.
మొత్తం నమూనాల్లో 51.05 శాతం మందిలో కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు పరిశోధకులు గుర్తించారు. వీరందరికీ లక్షణాలు లేకుండానే కరోనా సోకి ఉండవచ్చని సర్వే పేర్కొంది. వైరస్ సోకినట్లు చాలా మందికి తెలిసి కూడా ఉండదని తెలిపింది.
జులై 20 నుంచి సర్వే చేయగా.. అందుకు 15 రోజుల ముందు ఎప్పుడైనా వైరస్ ఆయా వ్యక్తులకు సంక్రమించి ఉండొచ్చని సర్వే వెల్లడించింది. ఈ సర్వే ప్రధానంగా 18 నుంచి 65 ఏళ్ల వయస్సు వారిపైనే జరిగింది. 66 ఏళ్లు పైబడిన వారిపై (మిగత వారితో పోలిస్తే) వైరస్ ప్రభావం అంతగా లేదని సర్వే అభిప్రాయపడింది.
వారిపై కరోనా ప్రభావం తక్కువే..
సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం.. 52.8 శాతం మంది పురుషులు, 50.1 శాతం మంది మహిళలకు కరోనా సోకింది. 66 ఏళ్లు దాటిన వారిలో 32.6 శాతం మంది కరోనా బారిన పడ్డారు. మురికి వాడలు, పబ్లిక్ టాయ్లెట్లు ఎక్కువగా వాడే వారికి వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.
ఇదీ చూడండి:మరింత క్షీణించిన ప్రణబ్ ఆరోగ్యం