పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా దిల్లీ అట్టుడుకుతోంది. దేశ రాజధానిలోని శీలంపుర్లో ఆందోళనకారులు చేపట్టిన నిరసన హింసాయుతంగా మారింది. రాళ్ల దాడి.. బాష్పవాయుగోళాల ప్రయోగంతో ఈశాన్య దిల్లీ హోరెత్తింది. ఈ ఘర్షణలో పోలీస్ వాహనాలు ధ్వంసం కాగా.. పలువురు పోలీసులు, ఆందోళనకారులు గాయాలపాలయ్యారు.
'పౌర' చట్ట సవరణకు వ్యతిరేకంగా మంగళవారం ఈశాన్య దిల్లీలో చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. శీలంపుర్, జఫ్రాబాద్ ప్రాంతాల్లో చేపట్టిన ఆందోళన హింసకు దారితీసింది. మధ్యాహ్నం 12గంటల సమయంలో శీలంపుర్ నుంచి నిరసనకారులు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. 'పౌర' చట్టం, ఎన్ఆర్సీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో జఫ్రాబాద్ ప్రాంతంలోనూ నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు.
రాళ్ల దాడి.. బాష్పవాయుగోళాల ప్రయోగం.
పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్ల దాడికి దిగారు ఆందోళనకారులు. వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు పోలీసులు. అనంతరం ఆందోళనకారులను ఘటనాస్థలం నుంచి పంపించారు.
"ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. ఉద్రిక్త వాతావరణాన్ని సాధారణ పరిస్థితికి తీసుకొచ్చేందుకే బాష్పవాయుగోళాలను ప్రయోగించాం. ఆందోళనకారుల దాడుల్లో కొంతమంది పోలీసులు గాయపడ్డారు. రెండు ఆర్టీసీ బస్సులు, కొన్ని పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి."
- అలోక్ కుమార్, దిల్లీ జాయింట్ పోలీస్ కమిషనర్.
ఘర్షణల దృష్ట్యా శీలంపుర్ ప్రాంతంలోని మెట్రో స్టేషన్లను అధికారులు కొద్దిసేపు మూసివేశారు.