నూతన సంవత్సరంలో భారత్కు కొవిడ్-19 టీకా అందనుందని సూత్రప్రాయంగా తెలిపారు భారత ఔషధ నియంత్రణాధికారి వీజీ సోమని. ఓ వెబినార్లో ఈ మేరకు కొత్త ఏడాదిలో శుభవార్త అందనుందని వెల్లడించారు. విపత్కర సమయంలో ఔషధ పరిశ్రమ, పరిశోధన సంస్థలు కీలక భూమిక పోషించాయన్నారు.
" బహూశా.. చేతిలో ఏదో దానితో చాలా సంతోషకరమైన నూతన ఏడాది ఉంటుంది. నేను చెప్పగలిగేది అదే. కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతుల కోసం పూర్తి సమాచారం కోసం వేచిచూడకుండా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగంగా సాగుతోంది. పలు టీకాల ఫేజ్ 1, 2 పరీక్షలను ఒకేసారి నిర్వహించేందుకు అనుమతించాం. అయితే.. టీకా భద్రత, సమర్థతపై ఎలాంటి రాజీ ఉండబోదు."
- వీజీ సోమని, డ్రగ్ కంట్రోల్ జనరల్
టీకా అత్యవసర వినియోగానికి అనుమతులపై నిపుణుల కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో సోమని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ క్రమంలో టీకా అత్యవసర వినియోగానికి కమిటీ ఆమోదం తెలిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలు తమ టీకాల అత్యవసర వినియోగం కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించడానికి నిపుణుల కమిటీ బుధవారం సమావేశమైంది. మరింత లోతుగా చర్చించేందుకు శుక్రవారం మరోసారి భేటీ కానుంది. ఈలోగా టీకాలపై మరింత సమాచారం ఇవ్వాలని సంస్థలను కోరింది.
ఇదీ చూడండి: జనవరి 2 నుంచి దేశవ్యాప్తంగా టీకా 'డ్రై రన్'