అమేఠీ ప్రజలకు బయటి వ్యక్తుల వద్ద చేతులు చాచేంత దుస్థితి పట్టలేదని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కేంద్ర మంత్రి, అమేఠీ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ ప్రజలకు షూ పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యతో రాహుల్ గాంధీతో పాటు అమేఠీ ప్రజలనూ స్మతి.. అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రియాంక.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేఠీలోని.. పలు కీలక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రియాంక. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాజపా విఫలమైందని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం పేదలు, రైతులు, నిరుద్యోగ యువతకు వ్యతిరేకంగా పనిచేస్తుందని విమర్శించారు.
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న వారి పాలనలో 50 లక్షల ఉద్యోగాలు పోయాయని దుయ్యబట్టారు ప్రియాంక. ప్రభుత్వం మహిళలను అసలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
"ఎన్నికలొచ్చాయి. పెద్ద పెద్ద వ్యక్తులు నియోజకవర్గంలోకి అడుగుపెట్టి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఇక్కడి ప్రజల్ని పట్టించుకోవడం లేదని కథలు చెబుతున్నారు. మీకు తెలుసు రాహుల్ ఎన్నిసార్లు మీ దగ్గరకు వచ్చారో. ఎవరి మనస్సులో అమేఠీ ఉందో మీకు బాగా తెలుసు. స్మృతి ఇరానీ ఇక్కడి ప్రజలకు షూ పంపిణీ చేస్తున్నారు. వీళ్లకు ధరించడానికి షూ కూడా లేవని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీని అవమానపరచాలని చూస్తున్నారు. అమేఠీ ప్రజలను అవమానపరుస్తున్నారు. ఎవరి వద్దా చేతులు చాచే దుస్థితి అమేఠీ ప్రజలకు పట్టలేదు."
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.
నాటకాలు ఆపితే మంచిది: స్మృతీ ఇరానీ
ప్రియాంక వ్యాఖ్యలపై స్మతి ఇరానీ బదులిచ్చారు. ఆమె.. ఒక్కసారి గ్రామాలను సందర్శిస్తే అసలు విషయాలు తెలుస్తాయన్నారు.
"నేను నటిని. ప్రియాంక గాంధీ నాటకాలు ఆపేస్తే మంచిది. అమేఠీలో ప్రజలకు ధరించడానికి షూ కూడా లేవు. ఆమెకు మానవతా దృక్పథం ఉంటే హరిహర్పుర్ గ్రామాన్ని సందర్శించాలి. అప్పుడే వాస్తవాలు తెలుస్తాయి. అక్కడికి వెళ్లడానికి ముందు ఆ గ్రామం ఎక్కడుందో అదృశ్యమైన ఎంపీ(రాహుల్)ను అడిగి తెలుసుకోవాలి"
-స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి
ఇదీ చూడండి: నేడు ఓటేయనున్న ప్రధాని మోదీ, అడ్వాణీ...