దేశంలో ప్రైవేటు రైళ్లు పరుగులు తీయడానికి రంగం వేగంగా సిద్ధమవుతోంది. తొలి విడతగా 12 ప్రైవేటు సర్వీసులు 2023 మార్చి నుంచి నడుస్తాయి. ఆ తర్వాతి సంవత్సరంలో మరో 45 బండ్లు వస్తాయని రైల్వే శాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం మీద 2027 నాటికి 151 ప్రైవేటు రైళ్లను ప్రారంభించనుంది.
ఈనెల 8న రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌క్యూ) రూపంలో కంపెనీల నుంచి ప్రతిపాదనలను రైల్వే శాఖ ఆహ్వానించింది. వాటిని నవంబర్ నాటికి ఖరారు చేసే అవకాశం ఉంది. 2021 నాటికి బిడ్డర్ల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. స్థూల రెవెన్యూలో అత్యధిక వాటాను ఇవ్వజూపే బిడ్డర్లను ఎంపిక చేస్తామని అధికారులు తెలిపారు. "2021 మార్చి కల్లా టెండర్లు ఖరారవుతాయి. 2023 మార్చి నుంచి ప్రైవేటు రైళ్లు నడుస్తాయి" అని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
- ప్రైవేటు రైళ్లలో 70 శాతం రైళ్లను దేశంలోనే తయారుచేస్తారు.
- 151 ప్రైవేటు రైళ్ల ద్వారా ఏటా రూ.3 వేల కోట్ల మేర హాలేజీ రుసుములను రైల్వే శాఖ ఆర్జించే అవకాశం ఉంది.
- ప్రైవేటు రైళ్లలో భారతీయ రైల్వేలకు చెందిన లోకో పైలెట్లు, గార్డులు పనిచేస్తారు.
- నిర్దేశిత ప్రమాణాలను అందుకోవడంలో ప్రైవేటు సంస్థలు విఫలమైతే జరిమానాలను రైల్వే శాఖ విధిస్తుంది.
ఇదీ చూడండి: 'రద్దీని నియంత్రించేందుకు రైల్వేశాఖ చర్యలు'