కొవిడ్ సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. మహమ్మారి దెబ్బకు చతికిలపడ్డ పలు రంగాలకు తిరిగి ఊపిరులూదేందుకు ఈ నిధులు దోహదపడనున్నాయి. మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు కీలక ప్రకటనలు చేశారు. కరోనాను జయించడంతోపాటు అన్ని రంగాల్లో స్వావలంబన సాధించడం మన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రకటించిన గరీబ్ కల్యాణ్ యోజన తాజా ప్యాకేజీలో భాగంగానే ఉంటుంది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే పలు దేశాలు భారీ ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాయి. జపాన్ తమ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 21%తో సమానమైన ప్యాకేజీని, అమెరికా తమ జీడీపీలో 13% విలువైన ప్యాకేజీని ప్రకటించాయి.
మరింత సరళంగా లాక్‌డౌన్-4
ఆ తర్వాత అతి పెద్ద ప్యాకేజీ మనదేనని భావిస్తున్నారు. మరోవైపు, కరోనా వ్యాప్తి నియంత్రణలోకి రాకపోవడంతో.. ఈ నెల 17 తర్వాత కూడా దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతుందని మోదీ వెల్లడించారు. అయితే- ఇప్పటితో పోలిస్తే లాక్‌డౌన్-4 భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రాల నుంచి అందిన సలహాలు-సూచనల ఆధారంగా నిబంధనలను ఈ నెల 18కి ముందే ప్రకటిస్తామన్నారు.
"కొవిడ్ సంక్షోభ సమయంలో నిరుపేదలు, రోజువారీ పనులతో పొట్టపోసుకొనేవారు ఇబ్బందులు పడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. కష్టాలను పట్టించుకోకుండా దేశ హితం కోరినవారిని బలోపేతం చేయడం మన కర్తవ్యం. వారి ఆర్థిక హితం కోసం నిర్ణయాలు తీసుకోవడం మన బాధ్యత. పేదలు, శ్రామికులు, వలస కార్మికులు, పశు పోషకులు, మత్స్యకారులు, సంఘటిత-అసంఘటిత రంగంలో ఉన్న వారందరి సంక్షేమం కోసం ప్రకటన చేస్తాం." - ప్రధాని నరేంద్ర మోదీ
స్వావలంబన దిశగా భారత్ అడుగులు వేసేందుకు తాజా ప్యాకేజీ ఊతమిస్తుందని మోదీ పేర్కొన్నారు. 'కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్నవారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఓ ప్యాకేజీని ప్రకటించింది. రిజర్వు బ్యాంకూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు ఈ ప్యాకేజీని ప్రకటిస్తున్నాం. ఇవన్నీ కలిపితే రూ.20 లక్షల కోట్లవుతుంది. ఇది భారత జీడీపీలో దాదాపు 10%తో సమానం. కోట్లమందికి జీవనోపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ఈ ప్యాకేజీ తిరిగి ఊపిరులూదుతుంది. ఉద్యోగులు, శ్రామికులు, రైతులతోపాటు దేశం కోసం కష్టపడే ప్రతిఒక్కరికీ ఉపయుక్తంగా మారుతుంది. ప్యాకేజీ వివరాలను బుధవారం నుంచి ఆర్థిక మంత్రి విడతలవారీగా తెలియజేస్తారు' అని మోదీ అన్నారు.
సంస్కరణల వల్లే నిలబడగలిగాం
గత ఆరేళ్లలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగానే కష్టకాలంలోనూ దేశంలోని వ్యవస్థలన్నీ సంపూర్ణ శక్తి సామర్థ్యాలతో పనిచేయగలిగాయని ప్రధాని పేర్కొన్నారు. "కేంద్రం పంపే డబ్బు నూటికి నూరు శాతం పేదల జేబుల్లోకి చేరుతుందని గతంలో ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు అది జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా బంద్ అయినప్పటికీ.. జన్‌ధన్, ఆధార్ వంటి సంస్కరణలు అందుకు దోహదపడ్డాయి. ఈ సంస్కరణలు ఇంకా విస్తృతం కావాలి. రైతులు మరింత శక్తిమంతమవ్వాలి. అప్పుడే భవిష్యత్తులో కరోనాలాంటి సంక్షోభాలు వచ్చినా వారిపై ప్రభావం తక్కువగా ఉంటుంది. హేతుబద్ధమైన పన్నుల వ్యవస్థ, సరళమైన నియమాలు, మెరుగైన మౌలిక వసతులు, సమర్థ మానవ వనరులు, బలమైన ఆర్థిక వ్యవస్థ కోసం సంస్కరణలు అవసరం. అప్పుడే వ్యాపారాలకు ప్రోత్సాహం లభిస్తుంది. 'భారత్‌లో తయారీ' సంకల్పాన్ని ఇవన్నీ బలోపేతం చేస్తాయి" అని తెలిపారు. కరోనా విజృంభణతో పెద్ద పెద్ద వ్యవస్థలు చిగురుటాకుల్లా వణికిపోయాయని, భారత్ మాత్రం క్లిష్ట పరిస్థితుల్లోనూ పేదలకు అండగా నిలబడిందని చెప్పారు.
దేశీయ వ్యవస్థలను కాపాడుకోవాలి
కరోనా కష్ట కాలంలో దేశీయ ఉత్పత్తి, విపణి, సరఫరా గొలుసు విలువ అందరికీ బాగా తెలిసొచ్చిందని ప్రధాని అన్నారు. సంక్షోభ సమయంలో దేశ అవసరాలన్నింటినీ ఈ స్థానిక వ్యవస్థలే తీర్చిన సంగతిని గుర్తుచేశారు. ‘‘స్థానికత మన జీవన మంత్రం కావాలి. ప్రపంచస్థాయి బ్రాండ్లన్నీ ఒకప్పుడు స్థానికమైనవే. విస్తృత వాడకం, ప్రచారంతోనే అవి ప్రపంచస్థాయికి ఎదిగాయి. ఇకపై ప్రతి భారతీయుడు స్థానిక ఉత్పత్తులను ఉపయోగించాలి. వాటికి ప్రచారం కల్పించాలి’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
ఆపదను అవకాశంగా మల్చుకున్నాం
కరోనా దెబ్బకు ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక చిన్న వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందని అన్నారు. 'ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. ఇది యావత్ మానవాళికి సంకటం. అయితే అలుపన్నదే లేకుండా ప్రపంచం కరోనాపై పోరాడుతోంది' అని పేర్కొన్నారు. కొవిడ్ సంక్షోభం భారత్‌కు ఆపదతోపాటు అవకాశాన్నీ తీసుకొచ్చిందని మోదీ అభిప్రాయపడ్డారు. 'కరోనా ఉద్ధృతి మొదలైనప్పుడు మన దేశంలో వ్యక్తిగత పరిరక్షణ సామగ్రి(పీపీఈ) కిట్ ఒక్కటి కూడా తయారయ్యేది కాదు. ఎన్-95 మాస్కులు నామమాత్రంగా ఉత్పత్తయ్యేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతిరోజు 2 లక్షల పీపీఈ కిట్లు, 2 లక్షల ఎన్-95 మాస్కులు తయారుచేసే స్థాయికి ఎదిగాం. ఆపదను అవకాశంగా మల్చుకున్నాం. స్వావలంబన దేశంగా సన్నద్ధమయ్యేందుకు ఇదే మనకు స్ఫూర్తినిచ్చింది' అని ప్రధాని వ్యాఖ్యానించారు.
లోక కల్యాణం కోసమే..
భారత్ ఎప్పుడూ విశ్వమానవ కల్యాణం కోసమే తపిస్తుందని మోదీ పేర్కొన్నారు. మన దేశం ఏ లక్ష్యాన్ని సాధించినా దాని ప్రభావం ప్రపంచమంతటా ఉంటుందని అన్నారు. 'పౌష్టికాహార లోపాన్ని అధిగమించడం, పోలియో నిర్మూలనలో భారత్ సాధించిన విజయాలు ప్రపంచ ముఖచిత్రాన్నే మార్చాయి. అంతర్జాతీయ సౌర కూటమి ద్వారా భూతాపంపై పోరాటానికి మనం మార్గం చూపాం. ప్రస్తుత కొవిడ్ సంక్షోభ సమయంలో కీలక ఔషధాలను అందించడం ద్వారా అందరికీ కొత్త ఆశాకిరణంగా మారాం. భారత్ లోక కల్యాణం కోసం కృషిచేస్తుందని ఇప్పుడు ప్రపంచం విశ్వసిస్తోంది' అని ప్రధాని తెలిపారు.
కచ్ తేరుకున్న తీరు ఆదర్శం
భూకంప విధ్వంసం నుంచి కచ్ తేరుకొని అభివృద్ధి సాధించిన తీరు అందరికీ ఆదర్శమని మోదీ అన్నారు. 'భారత్ తల్చుకుంటే స్వావలంబన సాధించగలదు. ఆ భవ్య భవనానికి ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతులు, అత్యాధునిక సాంకేతికతలతో పనిచేసే వ్యవస్థ, ఉత్సాహవంతులైన ప్రజలు, డిమాండ్ అనే ఐదు స్తంభాలు మూలాధారం. 21వ శతాబ్దాన్ని భారత శతాబ్దంగా మార్చడం మన బాధ్యత. అది స్వావలంబనతోనే సంపూర్ణమవుతుంది' అని చెప్పారు.
ఇదీ చూడండి: ఆర్థిక ప్యాకేజీ మీడియాకు హెడ్లైన్ మాత్రమే'