బిహార్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. అధికారంలో ఉన్న భాజపా-జేడీయూ కూటమి బహిరంగ ప్రచారం కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 సభల్లో మోదీ ప్రసంగిస్తారని భాజపా సీనియర్ నేత, బిహార్ ఎన్నికల ఇంఛార్జ్ దేవేంద్ర ఫడణవీస్ చెప్పారు.
అక్టోబర్ 23న ససరం, గయా, భగల్పుర్లో మోదీ పర్యటించనున్నారు. అక్టోబర్ 28న దర్బంగా, ముజాఫర్పుర్, పట్నాలో ప్రచారం చేయనున్నారు మోదీ. నవంబర్ 1న చప్రా, తూర్పు చంపారన్, సమస్తిపుర్లో జరగనున్న సభల్లో.. నవంబర్ 3న పశ్చిమ చంపారన్, సహర్షా, ఫోర్బ్స్గంజ్ ప్రచారాల్లోనూ మోదీ ప్రసంగించనున్నారు. వీటికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సహా ఎన్డీఏ తరఫున బరిలోకి దిగుతున్న నియోజకవర్గ అభ్యర్థులు హాజరుకానున్నారు.
నియోజకవర్గాల్లోనూ, మైదానాల వద్ద మోదీ ప్రసంగాలను ప్రసారం చేసేందుకు భారీ తెరలను ఏర్పాటు చేయనున్నారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోనున్నారు. సభలకు హాజరయ్యేవారి కోసం శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నారు.
బిహార్లో 243 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. ఫలితాలను నవంబర్ 10న ప్రకటించనున్నారు.