వైద్య సిబ్బంది భద్రత కోసం కేంద్రం తీసుకొచ్చిన అంటువ్యాధుల చట్టం సవరణ ఆర్డినెన్స్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ ఆరోగ్య సిబ్బందిపై దాడులు చేసినవారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్రం ఈ అత్యవసర ఆదేశం తీసుకొచ్చింది.
'జాతీయ అంటువ్యాధుల నివారణ చట్టం-1897'కి సవరణ చేస్తూ తెచ్చిన ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. ఎవరైనా దోషులుగా తేలితే 6 నెలల నుంచి 7ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. రూ. లక్ష నుంచి రూ.8 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
అమిత్ షా చొరవతో...
ప్రాణాలకు తెగించి మరీ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నా దేశంలోని కొన్ని చోట్ల వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు జరిగాయి. ఈ ఘటనల్ని తప్పుబడుతూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ). పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా... స్వయంగా రంగంలోకి దిగారు. వైద్య సిబ్బంది భద్రత విషయంలో ఏమాత్రం రాజీలేని చర్యలు చేపడతామని బుధవారం ఐఎంఏ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. వెంటనే నిరసనల్ని ఉపసంహరించుకుంది భారతీయ వైద్య సంఘం.
కొద్దిగంటల్లోనే వైద్యుల రక్షణ కోసం ఉద్దేశించిన ఆర్డినెన్సుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. నేడు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.