సుదృఢ భారత్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి దృఢమైన గ్రామీణ భారత నిర్మాణం జరగాలని ఉద్ఘాటించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన రైతు సంక్షేమంపై ప్రభుత్వం చేపట్టిన చర్యలను పార్లమెంట్ సమావేశాల ప్రారంభోపన్యాసంలో వివరించారు.
గ్రామీణ బండార్ యోజన ద్వారా రైతుల గ్రామాల్లోనే గోదాముల నిర్మాణం చేపట్టనున్నామన్నారు కోవింద్. మత్స్య పరిశ్రమలో ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉన్నామని ఉద్ఘాటించిన రాష్ట్రపతి... మొదటి స్థానానికి చేరుకునేందుకు నీలి విప్లవం ద్వారా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
10 వేల రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటును ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన ద్వారా చర్యలు తీసుకోనున్నామన్నారు.
"దృఢమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థతోనే బలమైన భారత్ సాకారమవుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం రైతులే. వ్యవసాయానికి సంబంధించి రాష్ట్రాలకు కేంద్రం మద్దతు కొనసాగుతుంది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రూ.50 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నాం. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు గత ఐదేళ్లలో అనేక పథకాలు చేపట్టాం. మద్దతు ధర పెంపుపై నిర్ణయం, ఫుడ్ ప్రాసెసింగ్‌పై వంద శాతం ఎఫ్‌డీఐకి అనుమతి, ఫసల్ బీమా యోజన విస్తరణ, రైతులకు హెల్త్‌కార్డులు వంటి అనేక చర్యలు చేపట్టాం. ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ఒకటి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం ద్వారా మూడు నెలల్లోనే 12 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి సాయంగా రైతులకు అందాయి. ప్రతీ రైతును కిసాన్ సమ్మాన్ నిధి కిందకు తీసుకువచ్చాక ఏటా 90 వేల కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించనున్నాం. "
-రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఇదీ చూడండి: 'ప్రగతి యజ్ఞం కొనసాగాలన్నదే ప్రజాభిమతం'