భారత్‌లో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేసింది కేంద్రం. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 75 ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్) సిబ్బందితో పాటు అన్ని భద్రతా దళాలను ఆదేశించారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. ఈ కేంద్రాల్లో 5400 పడకలను సిద్ధం చేయాలని సూచించారు.
ప్రధానంగా సరిహద్దు ప్రాంతాలతోపాటు మొత్తం 37 చోట్ల నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఏపీఎఫ్ సిబ్బందిని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ప్రాణాంతక వైరస్ ఎక్కువగా విదేశీయుల నుంచి సంక్రమిస్తున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో ఉన్న సైనికులు.. విదేశీయులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అన్ని భద్రతా దళాలు తమ జవాన్లకు కరోనాపై అవగాహన కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు అధికారులు వెల్లడించారు.
కేంద్రం ఆదేశాల మేరకు ఇప్పటికే ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసులు.. దిల్లీలోని ఛావ్లా ప్రాంతంలో నిర్బంధ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం 400 మంది చికిత్స పొందుతున్నారు. మానేసర్ ప్రాంతంలోనూ సైన్యం ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి చికిత్స అందిస్తోంది.
ఇదీ చూడండి: కాంగ్రెస్‌కు సింధియా గుడ్‌బై- భాజపాలో చేరినట్లేనా?