దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా వలసకూలీల కష్టాలు అన్నీఇన్నీ కావు. స్వస్థలాలకు చేరుకోవాలన్న ఆశతో కొందరు వందల కిలోమీటర్లు నడుస్తున్నారు. ఇలానే ఓ నిండు గర్భిణి రాజస్థాన్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన స్వగ్రామం కాస్గంజ్ చేరేందుకు.. కాలిబాట పట్టింది. కుటుంబంతో కలిసి వందల కిలోమీటర్లు ప్రయాణించింది.
ఇప్పటికే నెలలు నిండిన ఆ మహిళకు.. ఏ సమయంలో ప్రసవం అవుతుందో తెలియని పరిస్థితి. ఈ తరుణంలోనే త్వరగా ఇంటికి వెళ్లాలని ఆశిస్తున్నారు కుటుంబసభ్యులు. మహిళతో పాటు ఇంకా అనేక మంది వలసకార్మికులు రాజస్థాన్ సరిహద్దులో నడవడం కనిపించారు. వీరిలో చిన్నారులు, మహిళలు ఉన్నారు. మండెటెండను లెక్క చేయకుండా ప్రయాణం సాగిస్తున్నారు.
బస్సులు పంపినప్పటికీ..
ఇటీవలే రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్‌ప్రదేశ్‌కు వలస కూలీలను పంపేందుకు వెయ్యి బస్సులను కేటాయించినట్లు తెలిపింది. అయితే యోగి ప్రభుత్వం వాటిని అనుమతించకపోవడం వల్ల అవన్నీ తిరిగి రావలసి వచ్చిందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.