ఓ నిండు చూలాలు.. ఆసుపత్రికి వెళ్తూ మార్గ మధ్యంలోనే ఆడపిల్లను ప్రసవించిన ఘటన ఒడిశాలోని నౌపాడలో జరిగింది. సామాన్య ప్రజలకు వైద్య సేవలు ఎంత మృగ్యమో ఈ ఘటన తేటతెల్లం చేస్తోంది.
ముఖేష్ మాజీ అనే వ్యక్తి భార్య ప్రమీలా మాజీ నిండు గర్భిణి. నిన్న రాత్రి ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. వారు ఉంటున్నది కొండ ప్రాంతం. ఆ రాత్రి సమయంలో ఆమెను ఆసుపత్రిలో చేర్చలేకపోయారు. అంబులెన్స్ కూడా ఆ ఊరు చేరుకోలేకపోయింది.
అందువల్ల ప్రమీలను నులకమంచం మీద మోసుకుంటూ సమదాపాద గ్రామంలోని ఆసుపత్రికి బయలుదేరారు. నాలుగు కిలోమీటర్లు పయనించేటప్పటికి... ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. మార్గమధ్యంలోనే ఆమె చూడచక్కని ఆడపిల్లకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు.
ఈ ఘటన పేదల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మరోసారి కళ్లకు కట్టిందని స్థానికులు అంటున్నారు. వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లో... కనీస అవసరాలైన రోడ్లు, ఆసుపత్రులు, విద్యా వసతులు కల్పించకపోవడం దారుణమని వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరచి పేదల ఇక్కట్లకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: తమిళనాట మరోమారు 'అనర్హత' రాజకీయం