అది 1973.. ప్రణబ్‌కు కేంద్ర సహాయ మంత్రి వరించిన సంవత్సరం.. ఈ పదవి విచిత్రకర పరిస్థితుల్లో దక్కింది. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చూడటానికి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ప్రణబ్ ముఖర్జీ కేంద్ర సహాయ మంత్రిగా బయటకొచ్చారు. ప్రమాణం చేయబోయే మొత్తం మంత్రుల సంఖ్య అశుభకరమని 'పెద్దలు' భావించడం వల్ల ప్రణబ్‌ను పారిశ్రామిక అభివృద్ధి శాఖ సహాయ మంత్రిని చేసి 'లెక్క'ను సరిచేశారు. దీంతో అప్పటి నుంచి ప్రణబ్ రాజకీయ 'లెక్కలు' దాదాపుగా తప్పలేదు. రాజీవ్ హయాంలో రాజకీయ చీకటి అంటే ఏమిటో రుచి చూసి మళ్లీ 'వెలుగు'లోకి వచ్చిన తర్వాత ఇక పల్లమంటూ ఎరగలేదు. 1978లో సీడబ్ల్యూసీకి ఎంపికైన ప్రణబ్ 1980లో పార్టీలో నంబర్ 2 స్థానానికి ఎదిగారు. ఇందిరకు కీలక సలహాదారుడిగా ఉన్నారు.
పల్లెటూరి అబ్బాయి అనిపించుకోవడమే ఇష్టం!
దాదాగా సుపరిచుతుడైన ప్రణబ్‌ను సన్నిహితులు ముద్దుగా పొల్తు అని పిలుచుకొనేవారు. ప్రణబ్ ముఖర్జీకి రోజూ డైరీ రాసే అలవాటు ఉంది. ఎంత తీరిక లేకున్నప్పటికీ రోజూ ఒక పేజీ అయినా రాయడం అలవాటు. రోజూ ప్రణబ్ వేకువజామునే నిద్ర లేచేవారు. పూజ అనంతరం ఇక విధుల్లో మునిగిపోయేవారు. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పుస్తక పఠనం అలవాటు. మధ్యాహ్నం ఓ గంట పాటు కునుకు తీయడం అలవాటు. దాదాపు 17 ఏళ్లు స్వగ్రామంలోని పూర్వికుల ఇంట్లోనే ఉన్న ప్రణబ్‌కు స్వగ్రామం, ఆ ఇల్లు అంటే ఎంతో మమకారం. ఇప్పటికీ ఆయన తనను పల్లెటూరి అబ్బాయి అనిపించుకోవడానికే ఇష్టపడేవారు. ప్రణబ్ ముఖర్జీకి చేపల కూర అంటే ఎంతో ఇష్టం. మంగళవారాలు తప్పించి దాదాపు రోజూ చేపల కూర ఉండాల్సిందే!
లక్కీ నంబర్ 13
అందరూ దురదృష్టమైనదిగా భావించే '13' ప్రణబ్ ముఖర్జీకి అదృష్ట సంఖ్య. ఈ సంఖ్యతో ప్రణబ్‌కు ఎంతో అనుబంధం ఉంది. భారత 13వ రాష్ట్రపతిగా ఆయన ఎన్నికకావడం గమనార్హం. ఆయన లోక్‌సభకు తొలిసారిగా ఎన్నికైంది 2004 మే 13న. ప్రణబ్‌కు వివాహమైంది 1957 జులై 13న. ఆయన అప్పట్లో నివసించిన తల్కతొరా రోడ్డులోని 13వ నంబర్ ఇంటిలోనే. యూపీఏ ప్రభుత్వంలో వివాదాల పరిష్కర్తగా ప్రముఖ పాత్ర పోషించిన ప్రణబ్‌కు పార్లమెంటు రూమ్ నంబర్ 13లోనే కార్యాలయం ఉండేది.
ఇదీ చూడండి: ముఖర్జీ మరణంపై ఆరెస్సెస్, భాజపా విచారం