ప్రజలు అడుగు బయటపెట్టాలంటేనే భయపడే స్థితికి తీసుకొచ్చింది కరోనా. ఎటు నుంచి వ్యాపిస్తుందో తెలీదు. ఎవరి నుంచి సోకుతుందో ఊహించే వీలు లేదు. ఇక బస్సుల్లో రోజుకు వందల మంది ఎక్కుతుంటారు, దిగుతుంటారు. మరి రోజంతా ఆ బస్సులోనే ఉంటూ అందరినీ పలకరిస్తూ టికెట్టు కొట్టే కండక్టర్లకు రక్షణ ఏది? కర్ణాటకలోని ఓ ప్రైవేటు బస్సు యజమానికి ఇదే సందేహం వచ్చింది. అందుకే, తమ బస్సుల్లో ఉద్యోగాలు చేసే కండక్టర్లకు వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) కిట్లను అందించి వారి ప్రాణాలకు భరోసా కల్పించారు.
యజమాని పెద్ద మనసు...
ఇన్నాళ్లుగా కరోనాతో ప్రత్యక్షంగా యుద్ధం చేస్తోన్న వైద్యులకు పీపీఈ కిట్లే శ్రీరామ రక్షగా ఉన్నాయి. తల నుంచి కాలి వేళ్ల వరకు కప్పి ఉంచే ఈ పీపీఈ కిట్లు ధరిస్తే.. వైరస్ శరీరంపై సోకకుండా ఉంటుంది. అయితే, ఈ రక్ష ఇప్పుడు సేవా రంగంలో ప్రజల మధ్య విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికీ అవసరమేనని గుర్తించారు సాయిశా బస్సుల యజమాని నితిన్ శెట్టి. విధి నిర్వహణలో కరోనా బారిన పడకుండా కండక్టర్లకు పీపీఈ కిట్లు అందించి గొప్ప మనసును చాటుకున్నారు.
కండక్టర్లు ఉద్యోగాలు చేయకపోతే బస్సు కదలదాయే, వారి ఇల్లూ గడవదాయె. గత్యంతరం లేక రోజూ వందల మందిని తాకుతూ బిక్కుబిక్కుమంటూ పనిచేస్తున్నారు. అయితే, పీపీఈలు ధరించాక ధైర్యంగా టికెట్లు కొడుతున్నామంటున్నారు సాయిశా బస్సు కండక్టర్లు.
ఇదీ చదవండి:ఆ భక్తుడికి అంజన్న కల- బంజరు కొండకు హరిత కళ