భాజపా సహ వ్యవస్థాపకుడు, అగ్రనేత లాల్‌కృష్ణ అడ్వాణీతో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి శుక్రవారం భేటీ అయ్యారు. వీరిద్దరికీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదు భాజపా. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యాన్ని సంతరించకుంది.
భాజపాను వ్యతిరేకించినంత మాత్రాన దేశద్రోహులు కారని అడ్వాణీ తన బ్లాగులో గురువారం వ్యాఖ్యానించారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సందేశంలో భాజపా సిద్ధాంతాలను గుర్తు చేశారు. మనోగతాన్ని బహిర్గతపరిచారు.
అడ్వాణీ వ్యాఖ్యలు భాజపా ముఖ్యనేతలను ఉద్దేశించినవేనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. బాలాకోట్ వైమానిక దాడులపై ప్రశ్నించిన వారిని ప్రధాని నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా దేశ ద్రోహులని దుయ్యబట్టిన విషయం తెలిసిందే.
భారతీయ జనతా పార్టీకి ఎక్కువకాలం అధ్యక్షుడిగా వ్యవహరించారు అడ్వాణీ. గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి ఆరు సార్లు గెలుపొందారు. జోషి కూడా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. పార్టీకి మూడో అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
కాన్పూర్ నుంచి జోషి టికెట్ ఆశించగా భాజపా నిరాకరించింది. ఆయనకు బదులుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నియమించిన భాజపా ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్‌ను పోటీకి నిలబెట్టింది.