దాయాది దేశాల మధ్య ఆధ్యాత్మిక వారధిగా చెబుతున్న కర్తార్‌పుర్ నడవాను నవంబర్ 9న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. పంజాబ్ డేరా బాబా నానక్ వద్ద ఆర్ట్ పాసింజర్ టెర్మినల్ భవనాన్ని (పీటీబీ) మోదీ ప్రారంభిస్తారు. అనంతరం 3 కి.మీ దగ్గరలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత సుల్తాన్‌పుర్ లోధీలో నిర్వహించే గురునానక్ 550వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు మోదీ.
సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ 18 ఏళ్లకు పైగా పాకిస్థాన్ కర్తార్‌పుర్‌లో రావి నది తీరంలో ఉన్న దర్బార్ సాహిబ్ గురుద్వారాలో జీవినం సాగించారు. అందుకే ఈ ప్రాంతాన్ని సిక్కులు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు.
ప్రతిపాదిత కారిడార్ పాకిస్థాన్ కర్తార్‌పుర్‌లోని దర్బార్ సాహిబ్‌ను, పంజాబ్ గురుదాస్‌పుర్ జిల్లాలో గల బాబా నానక్ మందిరంతో కలుపుతుంది. ఫలితంగా ప్రతిరోజూ సుమారు 5వేల మంది భారతీయ సిక్కు భక్తులు, యాత్రికులు వీసాలేకుండానే పాక్‌లోని పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకునే అవకాశం కలుగుతుంది.
మోదీ ప్రారంభించనున్న ఈ పీటీబీలో మొత్తం 55 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఉంటాయి. వీసా అవసరం లేకపోయినప్పటికీ యాత్రికులు పాస్‌పోర్ట్‌ను మాత్రం వారి వద్ద ఉంచుకోవాలి.
- ఇదీ చూడండి: 'కశ్మీర్' నవశకానికి నాంది పడిన వేళ