కరోనా మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థల్ని గాడిలో పెట్టేందుకు పెద్ద దేశాలు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు. మానవాళి చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపుగా కరోనా నిలిచిపోతుందని.. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఇదేనని పేర్కొన్నారు మోదీ. దృశ్యమాధ్యమ విధానంలో శనివారం ప్రారంభమైన జి-20 శిఖరాగ్ర సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఎక్కడినుంచైనా పనిచేయడమనేది కరోనా అనంతరం ప్రపంచానికి అలవాటైందని.. ఈ నేపథ్యంలో జి-20 దేశాల సచివాలయాలన్నీ వర్చువల్‌గా ఏర్పాటు చేసుకోవచ్చని మోదీ చెప్పారు. ప్రతిభావంతులను తయారు చేసుకోవడం, సమాజంలో అన్ని వర్గాల వారికీ సాంకేతికతను అందుబాటులోకి తీసుకెళ్లేలా చూడటం, పాలనలో పారదర్శకత, భూమాత విషయంలో ధర్మకర్తృత్వంతో మెలగడం.. అనే నాలుగు ప్రధానాంశాలతో ప్రపంచ సూచీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీటి ఆధారంగా సరికొత్త ప్రపంచానికి జి-20 పునాదులు వేయగలదని చెప్పారు. మానవాళికి కలిగే ప్రయోజనం ఆధారంగా నూతన సాంకేతికతలకు విలువ కట్టాలన్నారు. మానవాళి భవితకు అందరం ధర్మకర్తలమేనని చెప్పారు.
చర్చల ద్వారా పరిష్కారం: జిన్‌పింగ్
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ.. పరస్పర గౌరవం, ఉభయులకూ లబ్ధి, సమానత్వం ప్రాతిపదకన అన్ని దేశాలతో శాంతియుతంగా కలిసివెళ్లడానికి తాము సిద్ధమని చెప్పారు. విభేదాలను సంప్రదింపుల ద్వారా, వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రపంచ శాంతికి, అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పడతామని పేర్కొన్నారు. కరోనాపై అంతర్జాతీయ సమాజమంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ వైరస్‌కు గట్టి అడ్డుకట్ట వేయడానికి జి-20 కూటమి దేశాలు సహకరించాలన్నారు. ముందుగా ఆయా దేశాలు దీనికి కళ్లెం వేసుకుని, ఆ తర్వాత అవసరమైన ఇతర దేశాలకు సాయం చేయాలని చెప్పారు.
కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో జి-20 దేశాలు పురోగతిలో ఉన్నాయన్నారు జిన్‌పింగ్. టీకా ఉత్పత్తి, పంపిణీలో ఇతర దేశాలకు సహకరించడానికి తాము సిద్ధమని చెప్పారాయన. పరిశ్రమలు, సరఫరా వ్యవస్థలు మునుపటి స్థాయికి చేరడానికి అడ్డంకుల్ని తొలగించి, రుసుముల్ని తగ్గించాలన్నారు. ఇబ్బందులను ఎదుర్కొంటున్న దేశాల ఆర్థిక వ్యవస్థల్ని ప్రోత్సహించడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తామని చెప్పారు. 19 సభ్యదేశాల అధినేతలు శిఖరాగ్ర భేటీలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'బాధ్యతాయుతంగా ఉండేవారికే మెరుగైన అవకాశాలు'