వరదల ధాటికి అతలాకుతలమైన అసోంను అన్ని విధాల ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని.. కరోనా ప్రభావం, బాగ్జన్ గ్యాస్ వెల్ ప్రమాదంపైనా ఆరా తీశారు.
"ప్రధాని మోదీ ఈ రోజు ఉదయం ఫోన్ చేశారు. అసోం వరదల ఉద్ధృతి, కొవిడ్ వ్యాప్తి, బాగ్జన్ గ్యాస్ వెల్ ప్రమాదానికి సంబంధించిన అంశాల గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి వాకబు చేశారు. రాష్ట్రాన్ని అనివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు."
- సర్బానంద సోనోవాల్, అసోం ముఖ్యమంత్రి
వరదల బీభత్సం
అసోంలో వరదల ధాటికి ఇప్పటి వరకు 81 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండ చరియలు విరిగి పడి 26 మంది వరకు మరణించారు. ఊళ్లు, పంట పొలాలు నీటమునిగి భారీగా ఆస్తి నష్టం సంభవించింది. మొత్తంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 27 లక్షల మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు.
కజిరంగా నేషనల్ పార్క్ నీట మునిగింది. దీనితో వేలాది వన్యప్రాణులు మరణిస్తున్నాయి. మరికొన్ని ఎటు వెళ్లాలో తెలియక, ఆకలితో అలమటిస్తున్నాయి.
ప్రజలు, వన్యప్రాణులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి అసోం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం సోనోవాల్... ప్రధాని మోదీకి తెలియజేశారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
ఇదీ చూడండి: అసోంలో ఆగని వరద ఉద్ధృతి.. 105కు చేరిన మృతులు