కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మొట్టమొదటగా, విధిగా చేయాల్సింది మాస్కు ధరించడం. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ధరించిన మాస్కు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఆ మాస్కు తయారుచేసిన దావణగెరెకు చెందిన ఓ కుటుంబం...దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
"లాక్‌డౌన్ సమయంలో...లైఫ్‌లైన్, రెడ్‌క్రాస్ సొసైటీతో కలిసి, నిస్సహాయులకు 40 రోజులపాటు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశాం. ఆ సమయంలోనే మాస్క్ తయారుచేయాలన్న ఆలోచన వచ్చింది. నా స్నేహితులు రాజు, రంజిత్ సింగ్, సతీశ్ నాకు సాయం చేశారు. 8 వేల మాస్కులు తయారుచేశాం. 7 వేల మాస్కులు ఉచితంగానే పంచిపెట్టాం."
-కేపీ వివేకానంద, మాస్క్ తయారీదారు
దావణగరెలోని కువెంపు ఎక్స్‌టెన్షన్ నివాసి వివేకానంద్ కాకోల్ ఓ మాస్కు కుట్టాడు. కాకోల్ కుటుంబం తయారుచేసిన ఆ మాస్క్‌ను...ప్రధాని నరేంద్రమోదీ ధరించారు. ఆ ఫోటోను కాకోల్ కుటుంబసభ్యులకు పంపింది ప్రధానమంత్రి కార్యాలయం. దేశంలో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత..వివేకానంద కుటుంబం మాస్కులు తయారుచేసి, వందలాది మంది పేదలు, ఆటోడ్రైవర్లు ఉచితంగా అందజేసింది. మామూలు కాటన్ వస్త్రంతో ఈ మాస్కులు కుట్టారు. ఎవరైనా ధరించేందుకు సౌకర్యవంతంగా ఉండే మాస్కులను..... జాతీయజెండాను ప్రతిబింబించేలా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో తయారుచేశారు. విద్యుత్ ఉపకరణాల వ్యాపారం చేసే రంజిత్, టైలర్ జేబీ రాజు సాయంతో ఈ మాస్కులు రూపొందించాడు వివేకానంద. ఆగష్టు 13న ఆయన కుమార్తె కేవీ కావ్య, ఆమె స్నేహితురాలు కవిత... స్పీడ్ పోస్ట్ ద్వారా పీఎంవోకు మాస్కులు పంపారు.
"ఇంట్లోనే మాస్కులు తయారుచేశాం. పీఎం మోదీకి మాస్కు పంపాలన్న ఆలోచన మా నాన్నకు వచ్చింది. దావణగెరె పోస్టాఫీసు నుంచి, స్పీడ్ పోస్ట్ ద్వారా మాస్కు పంపాం. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి స్పందన వచ్చింది. అదే మా పనికి మరింత ప్రోత్సాహం అందించింది."
-కేవీ కావ్య, వివేకానంద కుమార్తె
20 కాషాయం రంగు, 10 తెలుపు, 10 ఆకుపచ్చ రంగులు కలిపి, మొత్తంగా 40 మాస్కులను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపారు వివేకానంద కుటుంబసభ్యులు. అక్టోబర్ 10న దావణగెరె కుటుంబం పంపిన తెల్లని మాస్కు ధరించిన నరేంద్రమోదీ ఫోటోను...పవన్ చక్రవర్తి పంపించారు. అది చూసి, ఎంతో సంతోషించిన వివేకానంద ఇంటికి..పీఎంవో నుంచి అక్టోబర్ 22న కావ్య, కవితల పేర్లను ప్రస్తావిస్తూ ఓ లేఖ వచ్చింది. ప్రస్తుతం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల మాస్కులకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎంతోమంది ఈ మాస్కులు కొని, ధరించారు.
"పీఎం మోదీ మా మాస్కు ధరించినందుకు మాకు చాలా సంతోషం. మోదీ మాకు స్పందన పంపడం ఇంకా ఆనందంగా ఉంది. మా కుటుంబమే ఆ మాస్కు తయారుచేసింది. నా భర్త స్నేహితులు మాస్కుల తయారీలో సహాయం చేశారు."
-కేవీ శాంత, వివేకానంద భార్య
ఆత్మనిర్భర్ భారత్ కింద, వివేకానంద స్వయం ఉపాధి కల్పించుకున్నాడు. ఆయన భార్య శాంత, కుమార్తెలు కావ్య, నమ్రత, మాన్య...తండ్రికి సాయం చేస్తున్నారు. మాస్కుల తయారీతోనే వాళ్ల కుటుంబం గడుస్తోంది. ప్రధాని ధరించిన తర్వాత ఈ మాస్కులు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.