గ్రామీణ ప్రజలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన స్వామిత్వ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ప్రాపర్టీ కార్డులను అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరు రాష్ట్రాల్లో కార్డుల పంపిణీ మొదలుపెట్టారు. అనంతరం లబ్ధిదారులతో ముచ్చటించారు.
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తోన్న కోట్లాది మంది పౌరులకు ఈ పథకం ద్వారా సాధికారత కల్పించనుంది కేంద్రం. గ్రామస్థులు వారి భూములను ఆర్థిక ఆస్తులుగా పరిగణించి రుణాలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు మార్గం సుగమం కానుంది.
ఈ కార్యక్రమం ద్వారా సుమారు లక్ష మంది లబ్ధిదారులు వారి ప్రాపర్టీ కార్డులను ఎస్ఎమ్ఎస్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనేందుకు అవకాశం లభించనుంది. అనంతరం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాపర్టీ కార్డులను దస్తావేజుల రూపంలో అందజేస్తాయి. ఈ పథకం లబ్ధిదారుల్లో ఆరు రాష్ట్రాలలోని 763 గ్రామాల ప్రజలు ఉన్నారు.
స్వామిత్వ ద్వారా గ్రామాల్లోని ప్రజల వ్యక్తిగత ఆస్తుల వివరాలతోపాటు ప్రభుత్వరంగ ఆస్తుల వివరాలను కూడా సరిహద్దులతో సహా నిర్ణయిస్తారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రకటించారు. ప్రతి ఇంటితో పాటు రోడ్లు, చెరువులు, పార్కులు, దేవాలయాలు, అంగన్‌వాడీ, హెల్త్‌సెంటర్, పంచాయతీ కార్యాలయం వంటి అన్ని ఆస్తులను ఈ సర్వేలోకి చేర్చనున్నారు. సరైన దస్తావేజులు లేని కారణంగా తమ సొంత ఇళ్లపై బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు జరపలేని వారికి స్వామిత్వ ప్రాపర్టీ కార్డుల ద్వారా ఈ లోటు తీర్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.