కరోనా మహమ్మారి ఉద్ధృతి ఏడు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లా, బ్లాక్ స్థాయుల్లో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. పరీక్షలు, చికిత్సల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు.
" దేశంలో 700లకు పైగా జిల్లాలు ఉన్నాయి. కానీ, ఏడు రాష్ట్రాల్లోని 60జిల్లాల్లోనే వైరస్ ఉద్ధృతి అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏడు రోజుల పాటు జిల్లా, బ్లాక్ స్థాయుల్లో ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలని ముఖ్యమంత్రులకు సూచిస్తున్నా. సమర్థవంతంగా ఎదుర్కొన్న రాష్ట్రాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పరీక్షలు, కేసులను గుర్తించటం, చికిత్స, నిఘా, ప్రజలు అవగాహన కల్పించటం వంటివాటిని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఎలాంటి లక్షణాలు లేకుండానే చాలా వరకు వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో.. ప్రజల్లో అవగాహన కల్పించటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు మోదీ. అలాంటి సందర్భంలో పుకార్లు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, టెస్టింగ్‌పై ప్రజల్లో సందేహాలు నెలకొంటాయన్నారు. వైరస్ వ్యాప్తిని కొందరు తక్కువ అంచనా వేస్తూ తప్పు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత సమయంలో మాస్కులు ధరించడం చాలా ఇబ్బందిగా భావిస్తున్నా.. మన జీవితంలో మాస్క్‌ను ఒక భాగంగా చేసుకోకుంటే సరైన ఫలితాలు సాధించలేమన్నారు మోదీ.