ఉదయం 8.26 గంటల సమయం.. ఉత్తరాఖండ్ పౌరీ జిల్లా ఈటా గ్రామానికి చెందిన 76 ఏళ్ల మోహన్‌లాల్ బౌతియాల్ ఉదయాన్నే లేచి తన గోధుమ పొలాల చుట్టూ తిరిగేందుకు వెళ్లారు. అంతలోనే ఆయన జేబులోని సెల్‌ఫోన్ మోగింది. ఎవరు..? అని కాల్ లిఫ్ట్ చేశారు ఆ వృద్ధుడు. మీ స్నేహితుడు మీతో మాట్లాడాలనుకుంటున్నారని ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది జవాబిచ్చారు. అంతే.. అది నిజమా? కలా? అని ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు మోహన్‌లాల్. ఎందుకంటే ఆయనకు ఫోన్ చేసింది తన మిత్రుడు, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాబట్టి.
ఎలా ఉన్నావు? అంటూ సంభాషణ మొదలుపెట్టిన ప్రధాని.. మోహన్‌లాల్‌తో దాదాపు మూడు నిమిషాల పాటు ముచ్చటించారు. ఈ సందర్భంగా తన మిత్రుడి బాగోగులపై ఆరా తీసిన ప్రధాని.. గతంలో తామిద్దరు కలిసిన క్షణాలను నెమరు వేసుకున్నారు.
ఎప్పుడో గతంలో రెండుసార్లు కలిసిన తనను గుర్తుపెట్టుకుని మరీ.. ప్రధాని మోదీ ఫోన్ చేసినందుకు మోహన్‌లాల్ ఆనందానికి అవధుల్లేవు. "1998లో బద్రినాథ్‌లో జరిగిన ప్రదేశ్ భాజపా కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో మోదీ, నేను ఎలా కలుసుకున్నామో గుర్తుచేసుకున్నాం. ఆ తర్వాత 2014లో శ్రీనగర్ గర్వాల్‌లో జరిగిన ఎన్నికల సభలో మరోమారు ఇరువురు ఎదురుపడిన సంఘటనలను నెమరవేసుకున్నాం" అని వివరించారు మోహన్‌లాల్. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో జనసంఘ్ కాలంనాటి తన మిత్రులందరితో మాట్లాడాలని నిర్ణయించుకున్నందున.. తనకు ఫోన్ చేసినట్లు మోదీ చెప్పాన్నారు మోహన్‌లాల్.
" ఒక సమాన్య పార్టీ కార్యకర్తకు ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి స్వయంగా ఫోన్ చేసి, బాగోగులు తెలుసుకోవడమంటే ఎంతో గొప్ప విషయం. ఇలాంటి భావాలే మోదీని హీరోగా నిలిపాయి."
- మోహన్‌లాల్ బౌతియాల్, ప్రధాని మిత్రుడు
1960లో జనసంఘ్‌లో చేరిక
1960లో జనసంఘ్‌లో చేరారు మోహన్‌లాల్. 1970లో జనతాపార్టీ, ఆ తర్వాత 1980లో భాజపాలో చేరారు. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయినప్పుడు భాజపా పంచాయతీ సెల్ అధ్యక్ష పదవితో పాటు పార్టీలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు మోహన్‌లాల్.