ప్రధాని నరేంద్ర మోదీని మరోసారి విమర్శించింది శివసేన పార్టీ. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా జాతినుద్దేశించి ఎర్రకోటపై మోదీ చేసిన ప్రసంగాన్ని ప్రశ్నించింది. దేశంలో నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగాల కల్పన, కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి తీసుకుంటున్న చర్యలపై మోదీ మాట్లాడితే బాగుండేదని సేన అధికారిక పత్రిక 'సామ్నా'లో పేర్కొంది.
'గంటన్నర పాటు ప్రసంగించిన మోదీ.. కరోనా వ్యాక్సిన్ ట్రైల్స్, భారత రక్షణ సామర్థ్యం, జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్, వంటి పలు అంశాలపై అనర్గళంగా మట్లాడారు. అయితే మహమ్మారి కరోనా వల్ల కలిగే ఆర్థిక సంక్షోభం గురించి ఆత్మనిర్భర్ భారత్ పథకంను తొలగించగలదా?' ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడలేదని అని ప్రశ్నించింది శివసేన.
"దేశంలో ఇప్పటివరకు దాదాపు 14 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. భవిష్యత్లో ఈ సంఖ్య పెరగవచ్చు. ఫలితంగా ప్రజలు వీధిన పడతారు. ఇప్పటికే మహమ్మారి కారణంగా ఉద్యోగాలు, వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటిపై ప్రధాని మాట్లాడాల్సింది.
దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాడి మాతృభూమిని కాపాడటానికి సైనిక, వైమానిక దళాలున్నాయి. అయితే అంతర్గతంగా రక్కసిలా విరుచుకుపడుతున్న ఆకలి, నిరుద్యోగం వంటి సమస్యలతో మనం ఎలా పోరాడగలం?"
- సామ్నా సంపాదకీయం
ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారత్ వేగవంతం చేయగలదని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేసింది శివసేన. 'ప్రపంచాన్ని వదిలేయండి సార్. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించండి. స్వాతంత్ర్య వేడుకలు వస్తుంటాయ్, పోతుంటాయ్. సమస్యలు మాత్రం యథాతథంగా ఉంటాయి.' అని సామ్నా సంపాదకీయంలో పేర్కొంది.
ఇదీ చూడండి: 8 నెలలుగా తప్పిపోయి.. సరిహద్దుల్లో శవమై..