శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో కొలంబోలో భేటీ అయ్యారు ప్రధాని నరేంద్రమోదీ. రెండు దేశాలకు ఉమ్మడి శత్రువైన ఉగ్రవాదంపై పోరుకు కలిసి కృషి చేయాలని ఇరు దేశాల నేతలు తీర్మానించారు.
"పది రోజుల్లో రెండోసారి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో భేటీ అయ్యాను. రెండు దేశాలకు ఉగ్రవాదమే మొదటి శత్రువు. ఇద్దరమూ కలిసి దానిపై దృష్టి పెట్టాలి. శ్రీలంకతో దృఢమైన భాగస్వామ్యం కొనసాగుతుందని పునరుద్ఘాటిస్తున్నాను."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
సిరిసేనతో మోదీ ఇరు దేశాలకు సంబంధించి విషయాలపై చర్చించారు. ఈస్టర్ దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ దాడులతో శ్రీలంక స్ఫూర్తి చెక్కుచెదరలేదని వ్యాఖ్యానించారు. మళ్లీ ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని ఆకాంక్షించారు.
ఈస్టర్ నాటి ఉగ్రదాడుల తర్వాత శ్రీలంకలో పర్యటించిన మొదటి విదేశీ నేత మోదీనే.
మోదీకి ప్రత్యేక బహుమతి
మోదీకి ప్రత్యేకమైన "సమాధి బుద్ధ"ను బహూకరించారు సిరిసేన. అనురాధపుర తరానికి చెందిన ఈ విగ్రహానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.
అధ్యక్షుడి నివాసం వద్ద 'అశోక' మొక్కను నాటారు మోదీ.
సింఘే, మహీందాలతో భేటీ
లంక ప్రధాని రణిల్ విక్రమసింఘే, మాజీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మహీందా రాజపక్సతోనూ మోదీ భేటీ అయ్యారు. అనంతరం తమిళ జాతీయ కూటమి (టీఎన్ఏ) అధికారిక బృందంతో సమావేశమయ్యారు. ఈ బృందానికి ఆర్ సంపంథన్ అధ్యక్షత వహించారు.
ముఖ్యనేతలతో భేటీ పూర్తయ్యాక కొలంబోలోని ఇండియా హౌస్‌ను సందర్శించి.. అక్కడి భారత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. అనంతరం తిరిగి భారత్‌కు ప్రయాణమయ్యారు.
ఇదీ చూడండి: మోదీకి ఘన స్వాగతం పలికిన సింఘే