కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ... ప్రధాని నరేంద్ర మోదీకి సవాలు విసిరారు. దేశంలోని ఏదో ఒక విశ్వవిద్యాలయానికి వెళ్లి.. భారత ఆర్థిక వ్యవస్థ దుస్థితిపై విద్యార్థులతో ప్రధాని మాట్లాడాలన్నారు. దేశ సమస్యలపై ప్రజల దృష్టి మరల్చడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
పౌరసత్వ చట్టం, ఎన్ఆర్సీపై దిల్లీలో విపక్షాల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు రాహుల్.
"ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ కల్పన, దేశ భవిష్యత్ నిర్మాణంలో నరేంద్ర మోదీ విఫలమయ్యారు. మోదీకి ధైర్యముంటే మన విశ్వవిద్యాలయాలకు వెళ్లి... అక్కడి విద్యార్థులతో మాట్లాడాలి. దేశ ఆర్థిక వ్యవస్థ ఎందుకు భ్రష్టు పట్టిందో చెప్పాలి. దేశంలో నిరుద్యోగం 50 ఏళ్ల గరిష్ఠానికి ఎందుకు చేరిందో తెలియజేయాలి. కానీ ఈ దేశ ప్రధానికి అలా చెప్పే ధైర్యం లేదు. ప్రధానికి నేను సవాలు విసురుతున్నాను. పోలీసు బలగాలు, యంత్రాంగం లేకుండా దేశంలోని ఎదో ఒక వర్సిటీకి ఆయన వెళ్లాలి. వెళ్లి దేశానికి తాను ఏం చేయాలనుకుంటున్నానో చెప్పాలి."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
పౌరసత్వ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని విపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశాయి. జాతీయ పౌర పట్టిక- ఎన్పీఆర్ ప్రక్రియను తక్షణం నిలుపుదల చేయాలంటూ తీర్మానం చేశాయి. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో పార్లమెంటు భవనంలో సమావేశమైన పలు విపక్ష పార్టీల నేతలు సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
- ఇదీ చూడండి: రిలయన్స్ కొత్త ఎండీగా తొలిసారి నాన్-అంబానీ!