అమెరికాలోని హ్యూస్టన్ వేదికగా జరగబోయే హౌదీ-మోదీ కార్యక్రమానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఈ సందర్భంగా తన ప్రసంగానికి సంబంధించి దేశ ప్రజలు సలహాలు, సూచనలు చేయాల్సిందిగా ట్వీట్ చేశారు.
" 22న హ్యూస్టన్‌లో జరగబోయే హౌదీ-మోదీ కార్యక్రమం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఆ రోజున నా ప్రసంగం మీ నుంచే వినాలనుకుంటున్నాను. నా ప్రసంగానికి సంబంధించి మీ సూచనలు ఇవ్వండి. నా స్పీచ్‌లో భాగంగా అందులో కొన్నింటిని నేను సూచిస్తాను. నమో యాప్‌లోని స్పెషల్ ఫోరమ్‌లో మీ ఆలోచనలు తెలియజేయండి."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఒకే వేదికపై మోదీ-ట్రంప్
హ్యూస్టన్‌లో భారతీయ అమెరికన్లు నిర్వహించనున్న ‘హౌదీ-మోదీ’ కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేదిక పంచుకోనున్నారు. ఇదే విషయాన్ని ఆదివారమే అధికారికంగా ధ్రువీకరించింది శ్వేతసౌధం. వారం రోజుల అమెరికా పర్యటన సందర్భంగా హ్యూస్టన్‌లో జరిగే సభలో మోదీ అక్కడి భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 50వేల మంది హాజరు కానున్నారు.
ఈనెల 28న అమెరికాలోని అగ్ర సీఈవోలతో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమచారం. ఈ కార్యక్రమం సందర్భంగా ఉభయ దేశాల మధ్య ఓ వాణిజ్య ఒప్పందాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఐరాస సాధారణ సభలో ప్రసంగం
హౌదీ-మోదీ కార్యక్రమం అనంతరం ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో మోదీ ఈనెల 27న ప్రసంగిస్తారు. ఆ తర్వాత కొద్దిసేపటికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతారు.