జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో వీడియో టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్‌లో కరోనా టీకాల అభివృద్ధి గురించి ఆమెకు వివరించారు. ప్రపంచ దేశాల ప్రయోజనాల కోసం భారత్ తన శక్తి సామర్థ్యాలన్నింటినీ వినియోగించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
జర్మనీ సహా ఐరోపా దేశాల్లో కరోనా కొత్త రకం స్ట్రెయిన్‌ను విజయవంతంగా కట్టడి చేసినందుకు మెర్కెల్‌కు అభినందనలు తెలిపారు మోదీ. భారత్-జర్మనీల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆమె చేసిన కృషిని కొనియాడారు.
ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్(ఐఎస్ఏ)లో చేరాలని జర్మనీ తీసుకన్న నిర్ణయాన్ని మోదీ స్వాగతించారు. జర్మనీ-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 70 ఏళ్లు పూర్తైంది. వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొని 20 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా రెండు దేశాలు ప్రభుత్వాల అంతర్గత సంప్రదింపుల 6వ సమావేశాన్ని నిర్వహించేందుకు మోదీ, మెర్కెల్ అంగీకరించారు. త్వరలోనే తేదీలను ఖరారు చేయనున్నారు.