"ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన"ను నవంబర్ చివరి వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రానున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు మోదీ. ఫలితంగా 80కోట్ల మందికిపైగా ప్రజలకు ఉచితంగా అహార ధాన్యాలు అందుతాయని పేర్కొన్నారు.
అన్లాక్-2పై మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ ఈ విషయం వెల్లడించారు.
"వానాకాలంలో అన్నిటికన్నా వ్యవసాయ రంగంలో ఎక్కువ పని ఉంటుంది. పైగా జులై నుంచి ముఖ్య పండుగలు మొదలవుతాయి. గురు పూర్ణిమ, పంద్రాగస్టు, రక్షాబంధన్, శ్రీ కృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, దసరా తదితర పండుగలను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఫలితంగా అందరికీ అవసరాలు, ఖర్చులు పెరుగుతాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని.. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను నవంబర్ చివరి వరకు పొడిగించాలని నిర్ణయించాం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఐదు కిలోల బియ్యం, గోధుమలు అందుతాయని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం రూ.90వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. గత మూడు నెల ఖర్చులతో కలిపి ఈ పథకానికి రూ. 1.5లక్షల కోట్లను ఖర్చుచేస్తున్నట్లు వివరించారు ప్రధాని.
తస్మాత్ జాగ్రత్త...
అన్లాక్-2ను దృష్టిలో పెట్టుకుని ప్రధాని కీలక సూచనలు చేశారు. వానాకాలం వచ్చిందని.. జలుబు, జ్వరం వంటి వ్యాధులు చుట్టుముట్టే అవకాశముందని హెచ్చరించారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అన్లాక్-1 ప్రారంభమైనప్పటి నుంచి ప్రజల్లో కరోనా విషయంలో అశ్రద్ధ పెరిగిందన్నారు మోదీ. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి నిబంధనలను ఉల్లింఘించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని హెచ్చరించారు.