నాలుగేళ్లలో పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బిహార్ రాజధాని పట్నాలో ఎన్డీఏ సంకల్ప ర్యాలీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు మోదీ. పేదల రక్షణకు, దేశ రక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
బిహార్‌లో జరుగుతున్న అభివృద్ధిపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సౌభాగ్య పథకంతో ప్రతి ఇంటికి విద్యుత్ అందిస్తున్నారని ముఖ్యమంత్రి నితీశ్‌ను మోదీ అభినందించారు. నితీశ్-సుశీల్ మోదీ కలిసి రాష్ట్రాభివృద్ధిలో పురోగతి సాధించారని కొనియాడారు.
చౌకీదార్ ధైర్యాన్ని కొందరు సహించలేకే దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మోదీ ఆరోపించారు.
"చౌకీదార్‌ను దెబ్బతీసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు నిశ్చింతగా ఉండండి. మీ చౌకీదార్ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నాడు. పేదల రక్షణలోనైనా, దేశ రక్షణలోనైనా.. దేశాన్ని దెబ్బతీసేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను మీ చౌకీదార్, ఎన్డీఏ కూటమి గోడలా నిలబడి అడ్డుకుంటుంది."
---- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.