తమిళ గాయకుడు, సామాజిక కార్యకర్త, రచయిత టి.ఎం.కృష్ణ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు విధించిన లాక్డౌన్.. పేద ప్రజలను ఎంతగా ఇబ్బందిపెడుతోందో సినీ తారలకు అర్థం కావడంలేదని వాపోయారు.
ఒకే గదిలో ఇరుకుగా నివసించే మధ్యతరగతి కుటుంబాలకు.. భౌతిక దూరం పాటించడం ఎంత కష్టమో సెలబ్రిటీలకు తెలియదని విమర్శలు గుప్పించారు కృష్ణ. వలసకార్మికుల ఇబ్బందులు, ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలపై నోరు మెదపనివారంతా... స్వలాభం కోసం వారిపై జాలి చూపడం మానేసి, నోరు మూసుకుని కూర్చోవాలని హెచ్చరించారు.
"దయచేసి ఈ సినీ తారలు వారి భవంతులు, ఫామ్‌హౌజ్‌లలో నోరు మూసుకుని ఉంటారా? మార్చి 25వ తేదీ నుంచి ఇల్లు, వాకిలి లేకుండా ఆకలితో అలమటిస్తున్న వలస కూలీల గురించి వారు ఒక్క ముక్క మాట్లాడలేదు. ప్రజల బాధల గురించి వాళ్లకు పట్టింపేలేదు. ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం రాత్రికి రాత్రే సృష్టించిన ఈ గందరగోళంపై ఎవరూ నోరు మెదపరు. అంతులేని ఈ పరీక్ష కాలంలో వారి ఇబ్బందులపై ఒక్కరూ మాట్లాడలేదు. మీ రాజకీయ లబ్ధి కోసం ప్రతిరోజూ మాపై చూపిస్తున్న జాలిలో నిజాయితీ లేదు. అందుకే నోరు మూసుకుని ఉండండి!"
-టీ.ఎం.కృష్ట, ప్రముఖ గాయకుడు
కొన్ని చోట్ల ప్రజలు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం, ఆరోగ్య సంరక్షణ కార్మికులపై రాళ్లు రువ్వడంపై.. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ స్పందించిన మరుసటి రోజునే కృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి:బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే హత్యాయత్నం కేసు