1984 సిక్కుల ఊచకోత అంశంలో తన వ్యాఖ్యలపై భాజపా నేతలు, సిక్కుల నుంచి తీవ్ర విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. పిట్రోడా వ్యాఖ్యలు వ్యక్తిగతమని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.
"హిందీ సరిగా రాని కారణంగా సిక్కుల ఊచకోత అంశంపై నా ప్రకటన పూర్తిగా వక్రీకరణకు గురైంది. నేను చెప్పాలనుకున్నదేమిటంటే 'ఏదైతే జరిగిందో... అది తప్పుగా జరిగింది' అనే పదాన్ని నేను నా మనస్సులో అనువదించలేను. మనకు చర్చించేందుకు ఇంకా అనేక అంశాలున్నాయి. భాజపా పాలనపైనా చర్చ జరగాలి. నా వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నా."-సామ్ పిట్రోడా
సిక్కుల ఊచకోతపై జస్టిస్ నానావతి కమిషన్ నివేదిక ప్రకారం.. అల్లర్లపై అప్పటి ప్రధాని కార్యాలయం నుంచే ఆదేశాలు వెళ్లాయని భాజపా గురువారం ఆరోపించింది. ఈ ఆరోపణలకు సమాధానమిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు పిట్రోడా.
"1984 గురించి ఇప్పుడెందుకు? అయిదేళ్లలో ఏం చేశారో దాని గురించి మాట్లాడండి. సిక్కుల ఊచకోత ఘటన 1984 లో జరిగింది. అయితే ఏమిటి?" అని వ్యాఖ్యానించారు.
సామ్ పిట్రోడా వ్యాఖ్యలకు భాజపా నిరసన తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసం ముందు ఆందోళన చేసింది.
కాంగ్రెస్ స్పందన
ఏ వ్యక్తికైనా, వర్గానికైనా, ప్రాంతానికి, మతానికి వ్యతిరేకంగా అల్లర్లు చేయడాన్ని కాంగ్రెస్ ప్రోత్సహించదన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా. సిక్కుల ఊచకోత, 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసుల్లో దోషులకు శిక్ష పడేవరకూ కాంగ్రెస్ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు. సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు నేతలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు సుర్జేవాలా.
ఇదీ చూడండి: 'రఫేల్' రివ్యూ పిటిషన్లపై నిర్ణయం వాయిదా