దాదాపు నెల రోజుల పాటు రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీతో కథ సుఖాంతమైంది. కాంగ్రెస్ పార్టీతోనూ, రాజస్థాన్ ప్రభుత్వంతోనూ కలిసి పనిచేసేందుకు పైలట్ అంగీకరించినట్లు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. కోర్టుల వరకు వెళ్లిన ఈ థ్రిల్లర్ కథ అసెంబ్లీ తెర ఎక్కకముందే ముగిసింది. ఇంతకీ సచిన్ మనసు మార్చుకోవడానికి కారణాలేంటి? రాహుల్‌తో భేటీలో ఏం జరిగింది?
అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై అసంతృప్తితో 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి సచిన్ పైలట్ తిరుగుబావుటా ఎగరవేశారు. స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టును, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. గత కొద్దిరోజులుగా గహ్లోత్, పైలట్ ఎవరి క్యాంప్ వారే నడుపుతూ రాజకీయాన్ని రక్తి కట్టించారు. కానీ, అసెంబ్లీ సమావేశాలకు గడువు సమీపిస్తున్న వేళ సచిన్ పైలట్ మనసు మార్చుకున్నారు. తనవైపు ఎమ్మెల్యేల బలం తగినంత లేకపోవడమనేది ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఒకవేళ అసెంబ్లీ వేదికగా బల నిరూపణ జరిగితే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి లేదు. దీనికి తోడు రాజస్థాన్ భాజపాలో సైతం ఐక్యత అంతంతమాత్రమే. వసుంధర రాజె వర్గం కలిసొస్తుందన్న అంశంపై స్పష్టత కొరవడడం, పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఉన్న పదవీ పోయే పరిస్థితి నెలకొనడం వంటివి రాజీ ప్రయత్నాల వైపు మొగ్గేలా చేసినట్లు తెలుస్తోంది. సచిన్ పైలట్ కూడా సీఎం అశోక్ గహ్లోత్‌ను మాత్రమే టార్గెట్‌చేశారే తప్ప.. కాంగ్రెస్ పార్టీని పల్లెత్తు మాట అనలేదు. ఈ క్రమంలో అహ్మద్‌పటేల్, కేసీ వేణుగోపాల్ వంటి నేతలు చర్చల్లో కీలకంగా వ్యవహరించడంతో రాహుల్‌తో భేటీకి మార్గం సుగమమైంది.
భేటీలో ఏం జరిగింది?
దిల్లీలోని 10 జన్‌పథ్‌లో రాహుల్‌తో సుమారు రెండు గంటల పాటు సచిన్ పైలట్ భేటీ జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ భేటీలో ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొన్నట్లు సమాచారం. తన పోరాటం కేవలం అశోక్ గహ్లోత్‌పైనే తప్ప.. కాంగ్రెస్ పార్టీపై కాదని సచిన్ పైలట్ చెప్పినట్లు సమాచారం. ఇకపై రెబల్‌గా ఉండబోనని వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా పైలట్ సహా ఆయన అనుచర ఎమ్మెల్యేలపైనా ఎలాంటి చర్యలూ ఉండబోవని అధిష్ఠానం భరోసా ఇచ్చినట్లు సమాచారం. రెబల్ నేతలు లేవనెత్తిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ఇందుకు ముగ్గురితో సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఒకవేళ పార్టీలోకి తిరిగి వచ్చినా పార్టీ, ప్రభుత్వ బాధ్యతల్లో మాత్రం సచిన్ కొనసాగే అవకాశం కనిపించడం లేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనకు ఏఐసీసీ బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం చూస్తున్నట్లు సమాచారం.
గహ్లోత్‌కు సోనియా ఫోన్..
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌తో ఫోన్లో మాట్లాడారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ముగించే చర్యలను వేగవంతం చేయాలని కోరారు. రాహుల్ గాంధీతో సచిన్ పైలట్ భేటీ అనంతరం గహ్లోత్‌తో సోనియా మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు.. గహ్లోత్‌తో సచిన్ పైలట్ సన్నిహత నేత, పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేల భావర్ లాల్ శర్మాలు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోస్తారా, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నేపాల్ వల్లే బిహార్‌కు ఇన్ని ఇబ్బందులు: నితీశ్