సుప్రీంకోర్టులో భౌతిక విచారణను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని అదనపు భద్రతా చర్యలు పాటించి వచ్చే వారం నుంచి సుప్రీంకోర్టులోని కనీసం రెండు, మూడు బెంచీలలో భౌతిక విచారణ పునఃప్రారంభించాలని ఏడుగురు న్యాయమూర్తుల కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం.
భౌతిక విచారణకు కోర్టులను తెరవకూడదని బార్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని జులై చివరి వారంలో కమిటీ స్వాగతించింది. ఈ విషయంపై రెండు వారాల తర్వాత మళ్లీ చర్చిస్తామని పేర్కొంది.
ఈ నేపథ్యంలో కోర్టుల్లో భౌతిక విచారణ ప్రారంభించే అంశాన్ని న్యాయమూర్తుల కమిటీ తీవ్రంగా పరిశీలిస్తోందని.. 'సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్' అధ్యక్షుడు శివాజీ జాదవ్ తెలిపారు.
"వచ్చే వారం నాటికి 2-3 కోర్టుల్లో భౌతిక విచారణ ప్రారంభించాలని కమిటీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కోర్టులు భౌతిక విచారణకు సిద్ధంగా ఉండేలా రిజిస్ట్రీ తగిన చర్యలు తీసుకుంటోంది."
- శివాజీ జాదవ్, సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ అధ్యక్షుడు
ఈ అంశంపై బార్ కౌన్సిల్ సహా ఇతర అసోసియేషన్లతో న్యాయమూర్తుల కమిటీ సంప్రదింపులు జరుపుతోంది. ఆయా సంఘాలు సైతం భౌతిక విచారణ ప్రారంభించేందుకే మొగ్గుచూపుతున్నాయి. కొన్ని రకాల కేసులు వర్చువల్ పద్ధతిలో విచారించినప్పటికీ.. భౌతిక విచారణ ప్రారంభించాలని కోరుతున్నాయి.
కమిటీ తీసుకున్న నిర్ణయంపై తొలుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేకి సమాచారం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆన్లైన్ విచారణే
మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రారంభించినప్పటి నుంచి సుప్రీంకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు ఆలకిస్తోంది. లాక్డౌన్ ఆంక్షలు సడలించినప్పటికీ ఇదే విధానాన్ని కొనసాగిస్తోంది.
ఇదీ చదవండి: 'ఆ వార్తలు అవాస్తవం.. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది'