భారత దేశ ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆసియా-పసిఫిక్ ప్రాంత ప్రయోజనాల కోసం ఆర్సెప్ ఒప్పందంపై భారత్ సంతకం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు ఆస్ట్రేలియా మాజీ దౌత్యవేత్త పీటర్ వర్గీస్. భారత్ లేని ఆర్సెప్(ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య) ఒప్పందం బలహీనంగా ఉంటుందని అన్నారు.
పీటర్ ఇంతకు ముందు భారత్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్‌గా పనిచేశారు. భారత్‌తో ఆర్థిక భాగస్వామ్యం కోసం ఆస్ట్రేలియా అనుసరించాల్సిన వ్యూహంపై ఓ దస్త్రం రూపొందించారు. ఇందులోని సిఫార్సులను అమలుచేయడంపై సోమవారం దిల్లీలో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు పీటర్. రానున్న రోజుల్లో భారత్ 'ఆర్సెప్'లో చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పీటర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖిలోని మరిన్ని వివరాలు...
ప్రశ్న: 'భారత ఆర్థిక వ్యూహం' నివేదిక విషయంలో సాధించిన ముఖ్యమైన పురోగతి ఏమిటి?
జవాబు: నివేదికలోని సిఫార్సుల విషయంలో ప్రభుత్వం హేతుబద్ధమైన వైఖరి అవలంబిస్తోంది. ఆయా సిఫార్సుల అమలులో పురోగతి సాధించడానికి ఇప్పుడు మాకు ఒక యంత్రాంగం ఉంది.
ప్రశ్న: భారత్ ఆర్సెప్కు దూరంగా ఉండడం ద్వారా ప్రపంచానికి వెళ్తున్న సందేశమేమిటి?
జవాబు: భారత్‌తో కూడిన ఆర్సెప్ ఒప్పందం చాలా బలంగా ఉంటుంది. భారత్ పూర్తిగా ఆర్‌సెప్‌లో చేరకుండా ఉంటుందని నేను భావించడం లేదు. ఎప్పటికైనా భారత్ ఈ ఒప్పందంలో చేరడానికి వీలు కల్పించేలా చేయడం మా ప్రథమ కర్తవ్యం. సమీప భవిష్యత్తులో భారత్ తప్పకుండా ఇందులో చేరుతుందని ఆశిస్తున్నాం. నూతన వ్యాపార సరళీకరణ వ్యవస్థలో ఈ ప్రాంత ప్రయోజనాల కోసం భారత్ ఆర్‌సెప్‌లో ఉండాలి. భారత దేశ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలోని అతిపెద్ద వ్యాపార సరళీకరణ ఒప్పందంలో భాగం కావడం ముఖ్యం. స్వేచ్ఛ, సరళీకృత వాణిజ్యానికి కేవలం ఒక్క అడుగు దూరం మాత్రమే ఉంది. లేదంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంధకారం అలుముకునే ప్రమాదం ఉంది.
ప్రశ్న: ఆర్‌సెప్‌లో చేరితే భారత్‌లోకి చైనా వస్తువులు ఇబ్బడిముబ్బడిగా వస్తాయని ప్రభుత్వం వాదిస్తోంది. ఆసియాన్ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్యం కారణంగా కొన్ని దేశాలు వాణిజ్య లోటును ఎదుర్కొంటున్నాయి. దీనిపై ఏమంటారు?
జవాబు: ఇవన్నీ భారత్ తీసుకోవాల్సిన నిర్ణయాలు. వ్యాపార సరళీకరణ వల్ల మేమంతా కూడా స్వదేశంలో కొన్ని ఒడుదొడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రయోజనాలను సక్రమంగా బేరీజు వేసుకొని ఈ నిర్ణయాలన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాకు ఎదురైన అనుభవాల దృష్ట్యా ఇలాంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు సరైన ఫలితాలు ఇస్తాయని మాత్రం చెప్పగలను. చైనా, జపాన్ వంటి దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను బట్టి చూస్తే, ఇరు దేశాలు వీటి వల్ల లాభపడ్డాయి. ఈ విషయాన్ని గణాంకాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. రెండు దేశాలకు సమ్మతమైన ఒప్పందం ద్వారా ఇద్దరూ లాభపడేలా చేయవచ్చు.
ప్రశ్న: చైనా వస్తువులకు భారత్ డంపింగ్ యార్డులా మారుతుందనే ప్రభుత్వ భయాలను అతిశయోక్తిగా భావిస్తున్నారా?
జవాబు: భారత ప్రభుత్వ భయాలను నేను అర్థం చేసుకోగలను. కానీ ఇరువురికి ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకోవడం మీపైనే ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వం మాత్రమే తీసుకునే నిర్ణయాలు.
ప్రశ్న: ఆస్ట్రేలియా, భారత్ మధ్య సీఈసీఏ(సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం) కుదురుతుందని మీరు భావిస్తున్నారా?
జవాబు: ఆర్సీఈపీ కోసం సీఈసీఏను నిలిపివేశారు. ప్రభుత్వం చాలా ముందు చూపుతో ఆలోచించాల్సి ఉంటుంది. సీఈసీఏ ఒప్పందం లేకపోయినా ఇరుదేశాల ఆర్థిక సంబంధాలను మెరుగుపర్చుకోవడం సహా పెట్టుబడులు, వాణిజ్యాన్ని పెంచుకోవడానికి చాలా దారులు ఉన్నాయి. భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య సంబంధాలు కేవలం ఆర్సెప్, సీఈసీఏపై ఆధారపడి ఉంటాయని అనుకోకూడదు.
ప్రశ్న: భారత్ భాగస్వామి కాకపోతే ఆర్సెప్ ఉనికి కోల్పోతుందా?
జవాబు: భారత్ లేకపోతే ఆర్సెప్ బలహీనంగా ఉంటుంది. భారత్‌తో కూడిన ఆర్సెప్ ఒప్పందం మరింత బలంగా ఉంటుంది. భవిష్యత్తులో భారత్ ఆర్‌సెప్‌లో చేరడానికి తలుపులు తెరిచే ఉంచడం ఆస్ట్రేలియా వంటి దేశాలకు చాలా ముఖ్యం. త్వరలోనే భారత్ ఈ ఒప్పందంలో చేరుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒడుదొడుకులు, వ్యాపార సరళీకరణలో ఎదుర్కొంటున్న సవాళ్లను గమనించి ప్రపంచ జీడీపీ, జనాభాలో మూడో వంతు భాగం కలిగిన దేశాలన్నీ కలిసి ఓ ఒప్పందానికి వస్తున్నాయంటే ఇదొక గొప్ప ముందడుగనే చెప్పాలి. భారత్ తన స్వప్రయోజనాల ప్రకారం ఒప్పందం నుంచి బయటకు వెళ్లడం కంటే ఒప్పందానికి కట్టుబడి ఉండటమే సరైన నిర్ణయం అవుతుందనేది నా ఉద్దేశం. కాబట్టి, దగ్గరి భవిష్యత్తులో భారత్ ఆర్‌సెప్‌లో భాగమవుతుందని ఆశిస్తున్నాం.
ఇదీ చూడండి: ప్రగతి సూచీల నేలచూపులు... 2019-20లో వృద్ధి 5శాతమే!