కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీపై ధ్వజమెత్తారు. మోదీ ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టి, దేశాన్ని విభజించాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగంపై దాడి చేస్తే ప్రజలు సహించబోరని హెచ్చరించారు. దిల్లీలో 'సత్యాగ్రహం' పేరుతో పౌరసత్వ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన దీక్షలో రాహుల్ పాల్గొన్నారు.
నిరసనలో ప్రసంగించిన రాహుల్... విద్యార్థుల గొంతును అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారా అంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు.
దేశ ఉన్నతిని నష్టపరచాలని, ఆటంక పరచాలని శత్రువులు ఎంతో ప్రయత్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూర్చాలనుకున్నారు. అప్పుడు భారత దేశం గళం విప్పి వారిపై పోరాటం చేసింది. మన శత్రువులు చేయలేని పనిని ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నరేంద్ర మోదీ మీరు విద్యార్థులపై లాఠీ ఛార్జీలు చేయించి, బుల్లెట్లు ప్రయోగించి దేశం గొంతును అణచి వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
దేశంలోని అందరికి చెందిన రాజ్యాంగంపై దాడి చేయాలని చూస్తున్నవారిని భారత ప్రజలు అడ్డుకుంటారని రాహుల్ వ్యాఖ్యానించారు. 'సత్యాగ్రహం' కాంగ్రెస్ పార్టీ నినాదం కాదని యావత్ దేశానికి సంబంధించినదని పేర్కొన్నారు కాంగ్రెస్ నేత.
ఇదీ చూడండి: 'పౌరసత్వం పేరుతో భారతీయులను వేధించం'